Sunday, January 25, 2026
E-PAPER
Homeకథఆడపిల్ల చదువు

ఆడపిల్ల చదువు

- Advertisement -

అనగనగా రంగాపురం అనే గ్రామంలో శివయ్య, పార్వతమ్మ దంపతులు ఉండేవారు. వారికి అనిత, రమేశ్‌ అని ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. రమేశ్‌ బడికి వెళ్ళేవాడు. అనిత మాత్రం పొలానికి వెళ్ళేది. అనితకు తమ్ముడిలా చదువుకోవాలని ఉండేది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆడపిల్ల చదివి ఏం చేసేది అని అనుకునేవారు. పార్వతమ్మ అనిత ఇష్టాన్ని గమనించి, పొలం నుండి ఇంటికి వచ్చాక తెలిసిన వాళ్ళింటికి చదువు నేర్చుకొమ్మని కూతురిని పంపేది. అనిత కూడా ఎంతో ఇష్టంతో, శ్రద్దగా చదువుకునేది. అలా ఇంటిదగ్గర చదువుకొని పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతుంది. తమ్ముడు మాత్రం బడికి వెళ్ళినా చదువు అంతంత మాత్రమే ఉండేది. ఎన్నిసార్లు చెప్పినా బడి నుండి వచ్చాక స్నేహితులు, ఆటలు అంటూ తిరిగేవాడు. అనిత మాత్రం పొలం వెళ్లినా, వచ్చాక బుద్దిగా చదువుకునేది. ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాస్తారు. అనిత మంచి మార్కులతో పాస్‌ అవుతుంది, రమేశ్‌ మాత్రం తక్కువ మార్కులతో పాస్‌ అవుతాడు. అనితకు కాలేజ్‌లో చేరాలని ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. తనకు చదువు చెప్పిన మాస్టారు వచ్చి ఖర్చు నేనే పెట్టుకుంటాను అని ఒప్పించి కాలేజీలో చేరుస్తాడు. రమేశ్‌ కూడా చేరుతాడు కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం మానడు. అలా అలా చదువుకుంటూనే అనిత ఉద్యోగం కూడా సంపాదించుకుంటుంది. రమేశ్‌ పరిస్థితిలో మార్పు లేదు.
అనుకోకుండా ఒక రోజు తన తల్లి పార్వతమ్మ అనారోగ్యం పాలవుతుంది. వయసు అయిపోయింది ఇంక వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి. శివయ్య ఒక్కడే పొలం పనులు చూసుకుంటాడు. అనిత తెచ్చే జీతంతో ఇల్లు గడుస్తుంది. అనితకు పెళ్ళి చెయ్యాలనే ఆలోచన వచ్చి, ఉన్నంతలో పెళ్లి చేస్తారు. అనిత పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వెళ్లిపోవడంతో ఇల్లు గడవటం మరింత కష్టం అవుతుంది. ఇంట్లో పార్వతమ్మ మందులకు ఖర్చులు పెట్టలేక అప్పులు చేస్తుంటాడు శివయ్య. పెళ్ళి చేస్తే అయినా మారతాడేమో అని రమేశ్‌కి పెళ్ళి సంబంధాలు కూడా చూస్తారు. కానీ రమేశ్‌కి ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఏ సంబంధం కుదరదు. ఇంతలో పార్వతమ్మ అనారోగ్యం మరింత దిగజారిపోతుంది. ఆపరేషన్‌ చేస్తే కానీ బతకదు అంటారు డాక్టర్లు. డబ్బులు లేక ఇబ్బంది పడతాడు శివయ్య. కొడుకు ఉద్దరిస్తాడని కూతురును కాదని చదివిస్తే దేనికీ పనికి రాకుండా పోయావని తండ్రి, నన్ను బతికించకపోయినా పర్లేదు నీవు బతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని తల్లి ఏడుస్తూ రమేశ్‌ను మందలిస్తారు. ఊర్లో ఎక్కడికెళ్లినా ఎవరో ఒకరు రమేశ్‌ ను తక్కువ చేసి మాట్లాడేవారు. ఏం చెయ్యాలో రమేశ్‌కి అర్థం కాదు. పార్వతమ్మ ఆపరేషన్‌కి డబ్బులు అడిగితే ఎవరూ ఇవ్వడానికి ముందుకు రారు. చివరికి అనిత తాను దాచిపెట్టుకున్న డబ్బు తమ్మునికి ఇస్తూ, ఇప్పటికైనా మారు, అమ్మ గురించి కాదు, నీ బతుకు గురించే నా ఆలోచన అంటూ బాధ పడుతుంది. తల్లి ఆపరేషన్‌ అయ్యాక, రమేశ్‌ తండ్రిని ఇంటి దగ్గరే ఉండి అమ్మను చూస్కో అని చెప్పి తాను వ్యవసాయం చెయ్యడానికి బయలుదేరుతాడు. ఎప్పుడూ కోప్పడే తల్లిదండ్రుల కళ్ళలో ఆరోజు ఆనందం చూస్తాడు రమేశ్‌.
– జి. అఖిలేశ్‌,
9 వ తరగతి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -