Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమ్మాయిల చదువే సాధికారతకు మూలం

అమ్మాయిల చదువే సాధికారతకు మూలం

- Advertisement -

హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జి.రాధారాణి
చాలాసార్లు సమస్యలకు మూలం ఇంటి వాతావరణమే.. : ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ డాక్టర్‌ లావణ్య
ఎదుటివారి చూపు, పిలుపును గమనించాలి : సుద్దాల అశోక్‌ తేజ
తెలంగాణ బాలోత్సవం ”బాలిక సాధికారత బ్రోచర్‌’ ఆవిష్కరణ

నవతెలంగాణ – ముషీరాబాద్‌
అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడటానికి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధానమైన ఆయుధం చదువు అని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ జి.రాధారాణి అన్నారు. తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో బాలిక సాధికారత బ్రోచర్‌ను శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలను అధిగమించాలంటే చదువు ప్రధానమైన ఆయుధమన్నారు. చదువుతో మహిళలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు అనేకమంది ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ చాలా మంది మహిళల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ధైర్యం రాకపోవడం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలేనని చెప్పారు. వీటిని అధిగమించాలంటే ముందుగా తల్లితో.. ఆ తర్వాత మంచి స్నేహితులతో తమకు ఎదురైన సమస్యలను అమ్మాయిలు చెప్పుకోవాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మాయిలు త్వరగా పెండ్లి చేసుకున్నా చదువు కొనసాగింపుకు భర్తతో, అత్తింటి కుటుంబ సభ్యులతో నిర్భయంగా చెప్పి వారి భవిష్యత్‌ను వారే దిద్దుకోవాలన్నారు. కొన్ని పరిస్థితులలో చట్టాలు కూడా పనిచేయడం లేదని, అందుకని స్వయం సాధికారత సాధించడానికి అమ్మాయిలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ డాక్టర్‌ లావణ్య మాట్లాడుతూ.. చాలా సార్లు చిన్న వయసులోనే అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలకు మూలం ఇంటి వాతావరణమేనన్నారు. చదువుకోవడానికి వెళ్తే ఆకతాయిల చేతుల్లో బలవుతున్నారని, ఈ విషయం బయటకు చెబితే ఏమవుతుందోనని తల్లిదండ్రులకు కూడా చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 100, 1098, 181 వంటి హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి అమ్మాయిలోనూ టీనేజ్‌ వయస్సుల్లో సహజంగా జరిగే శారీరక మానసిక మార్పులు అనేక సమస్యలకు దారితీస్తాయని, వాటిని గుర్తించిన అమ్మాయిలు ధైర్యంగా నిలబడతారని అన్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ.. అమ్మాయిలు తమ కాళ్ళపై తాము ధైర్యంగా ఎదగాలన్నా.. ఎవరికివారు సాధికారతను సాధించాలన్నా.. మీతో మాట్లాడుతున్న ఎదుటివారిని గమనించాలని, వారి చూపు, వారి పిలుపు.. ప్రేమ ఆప్యాయతను కనబరుస్తుందా, ఆకలిని కనబరుస్తుందా గమనించాలని సూచించారు. వెంటనే మీరు మీ కాళ్లను చేతులను ఆయుధాలుగా మార్చాలన్నారు.

అలా కాకుండా భయపడితే ఎదుటివారికి అవకాశాన్నిచ్చిన వారవుతారన్నారు. అమ్మాయిలు తమకు నచ్చిన చదువు కొనసాగించి ఏ రంగంలోనైనా సాధికారత సాధించాలన్నారు. విజ్ఞాన దర్శిని అధ్యక్షులు టి.రమేష్‌ మాట్లాడుతూ.. నేటి చదువులు మూఢనమ్మకాల్లోకి నెట్టేస్తున్నాయన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడు ఏ రంగంలోనైనా రాణిస్తారని చెప్పారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు.. బాలిక సాధికారతపై స్క్రిప్టులు, గీతాలాపన, నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా 14 మందితో ”బాలిక సాధికారికత” కమిటీ వేశారు. ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్టు శైలజ, సుజావతి, అంకమ్మ, సౌదామిని, వంగపల్లి పద్మ, రజిత, తెలంగాణ బాలస్వామి ప్రధాన కార్యదర్శి ఎన్‌.సోమయ్య, ఆఫీస్‌ కార్యదర్శి, పిఎన్‌.కె బ్రాహ్మణి, మహేష్‌ దుర్గే, సాజిదా ఫాతిమా, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -