Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాలుష్యంపై సమగ్ర వివరణ ఇవ్వండి

కాలుష్యంపై సమగ్ర వివరణ ఇవ్వండి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగర వాసులకు తాగునీరు అందించే ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో కాలుష్య పరిస్థితులపై నాలుగు వారాల్లో సమగ్ర వివరణ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా నమోదైన ప్రజాహిత పిటిషన్‌ను సోమవారం హైకోర్టు బెంచ్‌ విచారించింది. జలాశయాల్లోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరుతున్నాయన్న ఆరోపణలను పరిశీలించాలని కోరింది. తాగునీటి ప్రమాణాలు పాటిస్తున్నారా, కాలుష్య నివారణకు ఏ చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై నీటిపారుదల శాఖ, జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. గడువులోగా వివరాలు సమర్పించకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. విచారణను వచ్చేనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై చివరి గడువు
జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన అంశంపై దాఖలైన పిటిషన్‌లో ప్రభుత్వానికి హైకోర్టు మూడు వారాల తుది గడువు ఇచ్చింది. నిర్దేశిత కాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోతే రూ.ఐదు వేల జరిమానా రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది. 1996లో వెలువడిన జీవో 570 ప్రకారం పునర్విభజన చేపట్టలేదని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. తదుపరి వారంలో పిటిషనర్‌ రిప్లరు కౌంటర్‌ దాఖలు చేయాలని సూచిస్తూ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తీర్పు వాయిదా
పిల్‌ను ఉపసంహరించుకోవాలంటే రూ.మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టులో విచారణ సోమవారం ముగిసింది. బంజారాహిల్స్‌లోని స్థల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవో 56ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ ఉపసంహరణకు రూ.మూడు కోట్లు డిమాండ్‌ చేశారంటూ పిటిషనర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. దీన్ని కొట్టేయాలని పిటిషనర్‌ వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని మాజీ ఎంపీ కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వర్‌రావు తరపు న్యాయవాది కోరారు. పిల్‌ వేసినందుకే తనపై ఎఫ్‌ఐఆర్‌ చేయించారని పిటిషనర్‌ రఘువీర్‌రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెల్లదన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

ఆ విద్యార్థులను ఇంటర్‌ పరీక్షలకు అనుమతించండి : ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం
కాలేజీలు ఫీజు చెల్లింపులో చేసిన పొరపాట్ల కారణంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించిన తర్వాత హాల్‌టిక్కెట్లు అందుతాయని భావిస్తారనీ, కాలేజీ ఇంటర్‌ బోర్డుకు ఆ ఫీజులు జమ చేయకపోతే విద్యార్థులు నష్టపోవడానికి వీల్లేదని తెలిపింది. ఎనిమిది మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం, పిటిషనర్ల వివరాల్లోని వాస్తవాలను పరిశీలించి వారికి ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం, 26 నుంచి రెండో సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యేలా హాల్‌టిక్కెట్లు జారీ చేయాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. ఇప్పటికే ముగిసిన ప్రాక్టికల్‌ పరీక్షలను ప్రత్యేకంగా పరిగణించి మళ్లీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాలేజీలకు చెల్లించిన ఫీజులను ఇంటర్‌ బోర్డుకు కాలేజీలు చెల్లించకపోవడంతో తమకు హాల్‌టిక్కెట్లు అందలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషన్లను అనుమతిస్తే సమస్యలు వస్తాయనీ, ఇప్పటికే ప్రాక్టికల్స్‌ పూర్తయ్యాయని బోర్డు అడ్వకేట్‌ చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విద్యార్థుల తప్పు కాదని అభిప్రాయపడింది. కోర్టుకు వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని బోర్డును ఆదేశించింది. సంబంధిత కాలేజీలకు, బోర్డుకు నోటీసులు జారీ చేసి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -