హెచ్-1బీ వీసాపై అమెరికామంత్రి కీలక వ్యాఖ్యలు
తర్వాత వెళ్లిపోండి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి హెచ్-1బీ వీసా పదం అందరి నోళ్లలో నానుతోంది. తాజాగా దీనిపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని అన్నారు. ”అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి.. ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లే తీసుకొంటారు” అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం అని వెల్లడించారు. ”విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారప డకుండా.. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలి. అందుకోసం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావడమే ఈ కొత్త విధానం” అని బెసెంట్ అన్నారు. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ కోసం చేస్తోన్న ప్రయత్నమిదని అభివర్ణించారు.
”రాత్రికి రాత్రే నౌకల్లో వస్తువులు ఎగుమతి అవుతాయని తాము చెప్పడం లేదన్నారు. ”మేం సెమీకండక్టర్ పరిశ్రమను అమెరికాకు తీసుకు రావాలని అనుకుంటున్నాం. ఆరిజోనాలో అందుకు తగ్గ సౌకర్యాలు ఉంటాయి. అందుకే అమెరికా కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి కొన్నేళ్ల కోసం విదేశీ శ్రామికశక్తిని రప్పించడమే అధ్యక్షుడి ఉద్దేశం అని నేను భావిస్తున్నాను. తర్వాత వారు ఇంటికి వెళ్లొచ్చు. ఆ తరువాతే అమెరికా కార్మికులు బాధ్యత స్వీకరిస్తారు” అని పేర్కొన్నారు. మేం వీసా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని హౌమ్‌లాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టి నోయమ్ అన్నారు. ”అమెరికాకు వచ్చే వ్యక్తులు ఉగ్రవాదులకు, అమెరికాను ద్వేషించే సంస్థలకు మద్దతుదారులు కాదని నిర్ధరించుకుంటాం. అందుకోసం వెట్టింగ్‌ను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాల ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది.
దాంతోపాటు అమెరికాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సరైన కారణాల వల్ల ఇక్కడ ఉన్నారని మేం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నాం” అని వెల్లడించారు. ట్రంప్ పాలనలో విదేశాల్లో జన్మించిన పౌరులు కూడా పౌరసత్వం పొందుతున్నారని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా సంస్కరణలపై స్వరం మార్చిన నేపథ్యంలో ఈ స్పందనలు వచ్చాయి. తమ శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనన్నారు. తమవద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు. అయితే అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణరంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమన్నారు.
మా వాళ్లకు శిక్షణ ఇవ్వండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



