కలెక్టరేట్ గేటుకు ఉరేసుకుని యువరైతు ఆత్మహత్యాయత్నం
70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు కబ్జా
ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి : బాధితుడు వడ్డె శ్రీనివాస్
నవతెలంగాణ-వికారాబాద్
తన భూమి ఇప్పించాలని ఓ యువ రైతు వికారాబాద్ కలెక్టరేట్ గేటుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లాలో గురువారం జరిగింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామానికి చెందిన 8 కుటుంబాలు.. 70 ఏండ్ల నుంచి 9 ఎకరాల 26 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. జీవనోపాధి కోసం ముంబాయికి రెండు కుటుంబాల రైతులు వెళ్లారు. వారు వెళ్లిన సందర్భంలో 3 ఎకరాల 26 గుంటల భూమిని పారెస్ట్ భూమంటూ అధికారులు అక్రమించుకొని కంచె వేశారు. 70 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమి.. అటవీ భూమి ఎలా అవుతుందని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.
వడ్డె చంద్రమ్మ వంతుకు వచ్చిన 24 గుంటల భూమి కోసం వడ్డె శ్రీనివాస్ ఎన్నో రోజుల నుంచి పోరాడు తున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో గురువారం కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది స్పందించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పి కిందకు దించారు. ‘తిరిగి తిరిగి అలసిపోయాం తమకు చావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు’ అని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి, కలెక్టర్ స్పందించి పేదలమైన తమకు న్యాయం చేయాలని కోరాడు.


