Saturday, February 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగోరంత ఇచ్చి…కొండంత ప్రచారం

గోరంత ఇచ్చి…కొండంత ప్రచారం

- Advertisement -

గ్రామపంచాయతీలకు నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎలక్షన్‌ స్టంట్‌
రావాల్సింది రూ.3 వేల కోట్లు… ఇచ్చింది రూ.260 కోట్లు
దీన్నే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోవాలని బీజేపీ ఎత్తుగడలు..రాష్ట్రంపై అడుగడుగునా ఆర్థిక ఆంక్షలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రావల్సిన రూ.3వేల కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.259.36 కోట్లను విడుదల చేసింది. ఏడాదికాలంగా ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోడీకి లేఖలు రాసింది. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల బృందంతో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పంచాయతీల పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలంటూ స్వయంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరోనెలరోజులు గడువు ఉందనగా, కేంద్రప్రభుత్వం ఈనెల 6వ తేదీ తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ నిధుల విడుదలకు పంచాయతీ ఎన్నికలను ముడిపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ క్రతువును ముగించి, నిధులిమ్మని కోరింది. కేంద్రం మళ్ళీ కొర్రీపెట్టింది. నాలుగేండ్ల యుటిలిటీ సర్టిఫికెట్లు ఇస్తేనే, ప్రస్తుత సొమ్మును ఇస్తామని షరతు విధించింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఈ సర్టిఫికెట్లను కేంద్రానికి పంపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న దశలో కేవలం రూ.259.36 కోట్లు మాత్రమే విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికే కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్తూ, సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ఈ నిధులతో గ్రామీణంలో స్వర్ణయుగం వస్తుందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న రూ.2,740 కోట్లకు సంబంధించి ఆ ప్రకటనలో కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇంతా చేస్తే రాష్ట్రానికి రావల్సిన సొమ్ములో కేంద్రం ఇచ్చింది కేవలం 8.66 శాతం మాత్రమే. పెండింగ్‌ సొమ్ము గురించి ప్రస్తావించని కేంద్రమంత్రి కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సొమ్మును గ్రామపంచాయతీలకు ఇచ్చారో ఏకరువు పెట్టారు. గ్రామాల అభివృద్ధి కోసం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దీనిపై ఎవరి దయాదాక్షిణ్యాలకు తావులేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేండ్ల కాలంలో రూ.5 వేల కోట్లు ఇచ్చామని కేంద్రంలోని బీజేపీ సర్కారు గొప్పగా చెప్తుంది. కానీ పంచాయతీల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రయినేజీలు, వీధిదీపాలు, భవన నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులు పెరిగాయి. కొన్నింటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. గ్రామాల్లో పేదల అవసరాలు పెరుగుతున్నాయి. కానీ కేంద్రం ఏడాదికి కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇస్తుండటం గమనార్హం. ఆ మాత్రానికే రాష్ట్రానికి చెందిన 8 మంది పార్లమెంటు సభ్యులు వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేస్తుండటం విడ్డూరంగా ఉందని అధికారపార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో దీన్ని ప్రచా రాస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి కేంద్రం ఇచ్చిన రూ.259.36 కోట్లకే ధన్యవాదాలు చెప్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎంత ఖర్చు అయితే అన్ని నిధులు ఇవ్వాలనే సహజ ధర్మాన్ని కూడా కేంద్రం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర బడ్జెట్‌లో గ్రామపంచాయతీలకు చేస్తున్న కేటాయింపులు, విడుదల అవుతున్న నిధులకు మధ్య భారీ ఆర్థిక అంతరం ఉండటం గమనార్హం!

హర్షణీయం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.260 కోట్లు విడుదల చేయటం పట్ల కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలు బలోపేతమవుతాయని శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులను విడుదల చేయాలంటూ కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయించానని చెప్పుకొచ్చారు. దశాబ్దకాలంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. 2015-16 నుంచి 2019-20 మధ్యలో రూ.5,060 కోట్లు విడుదల చేసిందని గణాంకాలు వెల్లడించారు. 2020-26 మధ్యలో కేటాయింపులు 80శాతానికి పెరిగాయని తెలిపారు. మిగతా నిధుల్ని దశలవారీగా విడుదల చేస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -