సేవలను పున: ప్రారంభించిన భారత్
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల వద్ద చైనా పౌరులకు టూరిస్ట్ వీసా సేవలను మళ్లీ ప్రారంభించింది. భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకున్నది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత చైనా పర్యాటకులకు భారత్ వీసాలు నిలిపివేసిన విషయం విదితమే. ఆ ఘటన రెండు దేశాల మధ్య సంబంధాలను దారుణ స్థితికి దిగజార్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జులైలో భారత్ మొదట బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ, హాంకాంగ్ కార్యాలయాల ద్వారా మాత్రమే వీసా ప్రాసెసింగ్‌ను పాక్షికంగా పునరుద్ధరించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీసా సేవలు తిరిగి ప్రారంభించటంతో..ఇది ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలను సూచిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. 2020 తర్వాత నిలిచిపోయిన భారత్-చైనా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు కూడా గతనెలలో మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక వేసవిలో కైలాస్-మానసరోవర యాత్రను కూడా పునరుద్ధరించారు.



