Wednesday, October 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'ప్రపంచీకరణ - కరువులు'

‘ప్రపంచీకరణ – కరువులు’

- Advertisement -

‘ఎగుమతులకు పనికొచ్చే’ పంటలను మరింత ఎక్కువగా పండించాలని భారతీయ రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్‌ 11న న్యూఢిల్లీ నుండి పిలుపునిచ్చాడు. మన రైతులు ఆహార ధాన్యాల సాగు నుంచి వైదొలగాలని, దేశం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకో వాలన్నదే ఆ పిలుపు సారాంశం. ప్రపంచ బ్యాంక్‌, దాని తరఫున వకాల్తా పుచ్చుకుని ఇక్కడ మాట్లాడే భారతీయ ఆర్థిక శాస్త్రవేత్తలు కొంత కాలంగా ఇస్తున్న సలహా ఇదే. సామ్రాజ్యవాద దేశాలు కోరుతున్నదీ ఇదే. అనేక సంవత్సరాలుగా అమెరికాలో రైతులకు భారీ సబ్సిడీలు ఇస్తున్నారు. ఆ దేశంలో పండే ఆహారధాన్యాల విలువలో దాదాపు సగం మేరకు ఆ సబ్సిడీ ఉంటుంది. దాంతో అక్కడి రైతులు పండించే ఆహార ధాన్యాల నిల్వలు కూడా బాగా పేరుకు పోతున్నాయి. వాటిని చెల్లగొట్టుకోవాలంటే భారతదేశం వంటి మార్కెట్లే వారికి దారి. అందుకోసం ఇక్కడి రైతులు ఆహార పంటల సాగు నుండి మారి అమెరికా వంటి దేశాల్లో పండించడం సాధ్యం కాని పంట లను పండించేలా ఒత్తిడి తెస్తున్నారు. సామ్రాజ్యవాదుల ఈ కోరికకు అనుగుణంగానే ఇక్కడ మోడీ రైతులకు సలహా ఇస్తున్నాడు.

గతంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవ సాయ చట్టాల సారాంశం కూడా ఇదే. ఆహార పంటల సాగునుండి వైదొలగి సామ్రాజ్యవాద దేశాలకు కావలసిన పంటను పండించేలా రైతులను నెట్టడమే వాటి అసలు ఉద్దేశం. అంతకు ముందు వరకూ కనీస గిట్టుబాటు ధరలు రైతులకు గ్యారంటీ చేసే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించి మద్దతు ధరలను ప్రకటించి అమలు చేస్తూ వుండే విధానం ఉండేది. మొదట అటువంటి మద్దతును వ్యాపార పంటల విషయంలో తొలగించారు. ఆ తర్వాత ఆహార పంటల విషయం లోనూ తొలగించడానికి ప్రయత్నించారు. కాని రైతులు ఏడాదికి పైగా జరిపిన పోరాటం ఫలితంగా ఆ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుని మద్దతు ధర విధానాన్ని ఆహార పంటల విషయంలో కొనసాగిస్తున్నారు. ఇది మోడీ ప్రభుత్వానికి కాని, సామ్రాజ్యవాదులకు గాని బత్తిగా రుచించని విషయం. అందుకే వాళ్లిద్దరూ తమ ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. తాజాగా మోడీ రైతులకు ఇచ్చిన సలహా ఈ వాస్తవాన్నే ధృవపరుస్తోంది.
ఆహార పంటల నుండి వైదొలగి ఎగుమతులకు పనికివచ్చే పంటల వైపు, అంటే వ్యాపార పంటల వైపు మళ్లడం వలన నిజానికి రైతులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్తూ ప్రపంచబ్యాంక్‌ తరఫున వకాల్తా పుచ్చుకున్న వారంతా రైతన్నల ఆందోళన కొనసాగుతున్న కాలమంతా ప్రచారం చేస్తూనే వచ్చారు. రైతులు ఆ విధంగా తమ సాగును మళ్ళించడానికి అవరోధంగా ఉన్నది మద్దతు ధరల విధానం అని, దాన్ని రద్దుచేస్తే అప్పుడు రైతుల వ్యాపార పంటలవైపు మళ్ళుతారని, దాని వలన వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని వారాకాలమంతా పనిగట్టు కుని ప్రచారం చేశారు. కాని రైతులకు కనీస మద్దతు ధర వ్యవస్థ ప్రాధాన్యత బాగా తెలుసు. ఒకసారి ఆ విధానాన్ని గనుక రద్దు చేస్తే ఆ తర్వాత మన రైతులు ప్రపంచ మార్కెట్‌లో ఆహార పంటల ధరల ఎగుడు దిగుడుల మాయాజాలంలో చిక్కు పడిపోతారు. గతంలో వ్యాపార పంటల విషయంలో వారికి వచ్చిన అనుభవం ఇదే. వ్యాపార పంటల ధరల విషయంలో ఆ పంటలు దిగు బడికి వచ్చే సమయంలో అమాంతం వాటి ధరలు పడిపోవడం అనేది మన రైతులకు అనుభవ వేద్యమే. దానికితోడు ఆ వ్యాపార పంటలను సాగు చేయడానికి ఎక్కువ పెట్టుబడులు అవసరమౌతాయి. అందుకోసం భారీ రుణాలు తీసుకోవలసి వస్తుంది. అలా తీసుకున్న రుణాలను ధరల పతనం తర్వాత చెల్లించడం రైతులకు అసాధ్యం అవు తుంది. అలా రుణాలను తీర్చలేని పరిస్థితులు ఏర్ప డినందు వల్లే గత మూడు దశాబ్దాల కాలంలో వ్యాపార పంటలు పండిచే రైతుల్లో నాలుగు లక్షల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్ప డ్డారు. అందుచేత రైతులకు ఎంతో కొంత రక్షణ కల్పించే కనీస మద్దుతు ధర వ్యవస్థ ను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం నల్లచట్టాల ద్వారా ప్రయత్నించినప్పుడు వారం తా దానిని బలంగా వ్యతిరే కించారు. ఆ మద్దతు ధర వ్య వస్థ గనుక రద్దయితే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వారికి స్పష్టంగా తెలుసు.

కనీస మద్దతు ధర వ్యవస్థ గనుక లేకపోతే ఆహార పంటల సాగునుంచి వ్యాపార పంటల సాగు వైపు మళ్ల డం, అటువంటి వ్యాపార పంటలను పండించిన తర్వాత వాటిరేట్లు పడిపోయి చేసిన అప్పులు తీర్చలేకపోవడం, దేశం మొత్తానికి రైతాంగంతో సహా ఆహార భద్రత లేకుండా పోవడం, ఇదంతా కరువుల రూపంలో మన ముందు దర్శనమి స్తుంది. అటువంటి కరువులు చాలా ఆఫ్రికన్‌ దేశాల్లో సంభవించాయి. అక్కడ ఆహార పంటల నుండి వ్యాపార పంటల వైపు ప్రపంచీకరణ వ్యవస్థలో రైతులు మళ్లడంతో అది కరువులకు దారితీసింది.
”ప్రమాదకర మార్గం” అన్న తన గ్రంథంలో ఆర్థిక వేత్త అమియా కుమార్‌ బాగ్చీ ఈ కరువులను ”ప్రపంచీ కరణ కరువులు” అని సరిగ్గా అతికినట్టు వర్ణించారు.
ఈ కరువులు ఎందుకొస్తాయి? కారణాలేమిటి? ఒక దేశం ఆహార పంటల సాగును మానేసి దానికి బదులు వ్యాపార పంటలను సాగు చేయడం మొదలుపెడితే, ఆ వ్యాపార పంటల ధరలు పడిపోయిన ఏడాది ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో రావలసిన ఆదాయం రాకుండా పోతుంది. అలా పడిపోయినప్పుడు తాను ఆహార అవసరాలకు దిగుమతి చేసుకునే ధాన్యాలకు చెల్లించవలసిన విదేశీ మారకద్రవ్యం ఉండదు. వ్యాపార పంటల ధరలతో పోల్చినప్పుడు ఆహార పంటల ధరలలో ఎగుడు దిగుడులు తక్కువగా ఉంటాయి. వ్యాపార పంటల ధరలు పడిపోయినా, ఆహారధాన్యాల ధరలు పడి పోయే అవకాశం తక్కువ. అందుచేత ఆహార ధాన్యాల దిగుమతికి చెల్లించవలసిన విదేశీ మారకద్రవ్యం సరిపడా లేకపోయేసరికి దేశంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత పడిపోతుంది. అప్పుడు కరువు పరిస్థితులు నెలకొంటాయి.

ఏదో ఒకవిధంగా ప్రభుత్వం ఏ ”సహాయమో” అర్ధించి ప్రజలకు కావలసిన ఆహారధాన్యాలను సేకరించిందనుకుందాం. అప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. వ్యాపార పంటలు పండించి దివాలా ఎత్తిన రైతుల దగ్గర ఈ ఆహార ధాన్యాలను కొనుగోలు చేయ డానికి సరిపడా ధనం ఉండదు. వారందరికీ ఆహార ధాన్యాలు అందాలంటే అప్పుడు ‘సహాయం’తో బాటు రైతులకు వాటిని కొనుగోలు చేయడానికి వీలుగా సబ్సిడీలు కూడా చెల్లించాలి. లేదా ఉచితంగా సరిపడా ఆహారధాన్యాలను వారికి సరఫరా చేయగలగాలి. లేకపోతే కరువును నివారించడం సాధ్యం కాదు.
ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. ఆహార పంటల సాగులో లభించే ఉపాధి (కూలీల అవసరం) వ్యాపార పంటల్లో ఉండదు. వ్యాపార పంటలవైపు మళ్లితే వారికి పనులు దొరకవు. అలా వ్యవసాయ పనులు దొరకని కూ లీలకు ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేసేశక్తి ఉండదు. అం దుచేత ఆహార ధాన్యాలు తగినంత దిగుమతి చేసుకోలేని స్థితి ఏర్పడినా, లేక దిగుమతి చేసుకున్న ధాన్యాన్ని కొను గోలుచేసేశక్తి దిగజారిపోయినా కరు వుపరిస్థితులు తప్పవు.
అందుచేత దేశ ఆహార భద్రతను దెబ్బతీసి రైతాం గాన్ని వ్యాపార పంటల సాగు వైపు నెట్టడం అనేది దేశాన్ని కరువు కాటకాలలోకి నెడుతుంది. నయా ఉదారవాద వ్యవస్థలో, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో, ప్రత్యే కించి ఆఫ్రికా దేశాల్లో ఇదే జరిగింది. మన దేశం ఇంత వరకూ ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా నివా రించగలిగింది. కాని ఇప్పుడు ప్రధాని మోడీ సలహాను రైతాంగం పాటిస్తే మాత్రం నివారించడం సాధ్యపడదు.

ఆహార ధాన్యాల అవసరాలకు దిగుమతుల మీద ఆధారపడడం ఉచితం కాదు అని చెప్పడానికి కేవలం అది కరువుకు దారితీస్తుందన్న ఒక్కటే కారణం కాదు. ఆహార ధాన్యాల కోసం ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడిన దేశాలకు మరొక ముప్పు కూడా ఉంది. క్యూబా, ఇరాన్‌, వెనిజులా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాల ప్రభుత్వాలు తనకు లొంగి నడుచు కోవడం లేదన్న అక్కసుతో వాటిమీద ఏకపక్షంగా అమెరికా ఆంక్షలు విధించింది. ఇంకా చాలా దేశాల మీద కూడా ఈ విధమైన ఆంక్షలు కొనసాగుతు న్నాయి. ఈ ఆంక్షల పేరుతో అమెరికా ఆ దేశాలతో వ్యాపారం చేయదు, తక్కిన దేశాలను కూడా వ్యాపారం చేయనివ్వదు. అటు వంటి స్థితిలో ఆ ఆంక్షలకు గురైన దేశం గనుక ఆహార ధాన్య అవసరాల కోసం దిగుమతుల మీద ఆధారపడి వుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ ఆంక్షలలో ఆయా దేశాల విదేశీ మారక నిల్వలను జప్తు చేయడం అనే చర్య కూడా ఒకటి ఉంది. అదే జరిగితే అప్పుడు జరిగే వినాశకర పర్య వసా నాలను ఊహించుకోగలమా? సామ్రాజ్యవాదాన్ని ఎదిరి ంచి నిలబడడానికి పూనుకున్నప్పుడు గాజాలో ఎంత నరమేధం జరిగిందో, దానిని ఆ సామ్రాజ్యవాద దేేశాల ప్రభుత్వాలన్నీ ఎంతగా సమర్ధించాయో మనం చూస్తు న్నాం. అటువంటప్పుడు సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి తలపడడానికి ఎన్ని దేశాలు ముందుకు రాగలుగుతాయి?
ఇప్పుడు ట్రంప్‌ సుంకాల యుద్ధం సాగిస్తున్నది మన దేశాన్ని ఆహారధాన్యాల దిగుమతి మీద ఆధారపడే దేశంగా మార్చడానికే. అదే జరిగితే మన దేశ స్వయం నిర్ణయాధికారం హరించుకుపోవడం ఖాయం. సామ్రాజ్య వాదుల బంటు హోదాకి మనదేశం దిగజారడం అనివార్యమౌతుంది.
రైతులకు ఈ విధంగా ఆహారధాన్యాల సాగు నుండి వ్యాపార పంటలసాగు దిశగా మారమని సలహా ఇస్తున్న మన ప్రధానికి సైతం ఈ విషయం మీద స్పష్టత ఉందా? అనుమానమే. మన పాలకుల పరిస్థితి ఇలా ఉండడం కూడా సామ్రాజ్యవాదుల ఒత్తిళ్లకు తలొగ్గడానికి దోహదం చేస్తుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -