అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించాలి
అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్రంలో అర్చక ఉద్యోగులకు నష్టం కలిగే విధంగా రూపొందించిన జీవో 121ని వెంటనే సవరించి అర్చక ఉద్యోగులకు న్యాయం చేయాలని అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అర్చక ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివిఆర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. అర్చక ఉద్యోగులకు జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. అర్చక ఉద్యోగులకు గ్రాంటింగ్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు.
అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు వేతనాల చెల్లింపులపై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశామన్నారు. స్పందించిన టిపిసిసి అధ్యక్షులు అర్చక ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పరశరం రవీంద్ర చారి, కాండూరి కృష్ణమాచారి, ఆనంద్ శర్మ, అగ్నిహోత్రం చంద్రశేఖర్, టీజీవో అధ్యక్షులు శ్రీనివాస్, పిసిసి కోఆర్డినేటర్ అరుణ్ కుమార్, నిరంజన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.



