సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హేతుబద్దీకరణ కంటే ముందే జీవో 25ను సవరించాలని సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్ జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం, యదాద్రి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్‌కు వినతి పత్రం సమర్పించారు.
20 మందిలోపు విద్యార్థులున్న ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు, 20 నుంచి 40 వరకుంటే ముగ్గురు, 40 నుంచి 60 వరకుంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, 60 మంది కంటే ఎక్కువుంటే ప్రతి తరగతికి ఉపాధ్యాయునితో పాటు ప్రధానోపాధ్యాయున్ని నియమించాలని వారు కోరారు. దీర్ఘకాలిక సెలవులపై ఉపాధ్యాయులు వెళ్లిన సమయంలో వారి స్థానంలో పని చేసేందుకు వీలుగా ప్రతి మండలంలో అదనంగా ఐదుగురు ఉపాధ్యాయులను తీసుకోవాలని సూచించారు. టెట్‌లో ఉపాధ్యాయులందరికీ తమిళనాడు బీహార్ రాష్ట్రాల మాదిరిగా 50 శాతం విధానాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.



