– కార్మిక సంఘాల ఆందోళనలు
– 10 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
– కలెక్టర్లకు వినతిపత్రాలు
– హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జీవో కాపీలను తగలబెట్టిన నాయకులు
రాష్ట్రంలో కార్మికలోకం భగ్గుమంది. 10 గంటల పనివిధానానికి సంబంధించిన జీవో నెంబర్ 282ను తక్షణం రద్దుచేయాలని నినదించింది. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అన్ని జిల్ల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. కలెక్టర్లకు వినతిపత్రాలు అందచేశారు. జీవో ప్రతులను తగులబెట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ దగ్గర జరిగిన ఆందోళనలో జీవో కాపీలను తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కార్మికుల శ్రమను కార్పొరేట్ల కోసం దోచిపెట్టే చర్యల్ని మానుకోవాలని హితవు పలికారు.
నవతెలంగాణ బ్యూరో/ విలేకరులు
రాష్ట్రంలో పదిగంటల పని విధానానికి వ్యతిరేకంగా, జీవో నెంబర్ 282 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్తాధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అక్కడి నుంచి కార్మిక శాఖ కమిషనరేట్ వరకు (అంజయ్య భవన్) ప్రదర్శన నిర్వహించారు. 282 జీవోను రద్దు చేయాలని కోరుతూ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు క్రాస్‌రోడ్స్‌లో సీఐటీయూ సిటీ సెంట్రల్ కార్యదర్శి ఎమ్ వెంకటేష్, ఏఐటీయూసీ సిటీ కార్యదర్శి బాలరాజు అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి అనూరాధ, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకె. బోస్, ఏఐయూటీయూసీ రాష్ట్ర ఇన్‌చార్జి భరత్ మాట్లాడారు. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-1988లోని సెక్షన్ 16, 17లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 282ను తీసుకురావడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నాలుగు లేబర్‌కోడ్‌లను రాష్ట్రంలో అమలుకు మార్గం సుగమం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీఓను తెచ్చిందని విమర్శించారు.
వెంటనే జీవో 282ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో రాష్ట్ర కార్మికవర్గమంతా ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ జీవోపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలపాలని కోరారు. బీజేపీ, టీడీపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇలా బూర్జువా పార్టీలు ఏవైనా కార్మికులను దోపిడీ చేసి పెట్టుబడిదారులకు మరిన్ని లాభాలు కట్టబెట్టే నిర్ణయాలే తీసుకుంటున్నాయని చెప్పారు. కార్మికుల పక్షాన ఎవరూ మాట్లాడట్లేదనీ, ఓట్ల కోసం మభ్య పెడుతున్నారనీ, ఈ విషయాలను కార్మికులు గమనించాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. జీవో 282 రద్దు చేసే దాకా కార్మికులు పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, పి. శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, వీఎస్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ సునీత, పి. రాజారావు, దశరథ్, మహేందర్, రాష్ట్ర నాయకులు ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎల్ పద్మ, ఏఐటీయూసీ సిటీ నాయకులు వెంకట్రావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు శివబాబు, టిఎన్‌టియుసి నాయకులు బాబారు, హెచ్‌ఎంఎస్ నగర ప్రధాన కార్యదర్శి అంజిత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా….
జీవో నెంబర్ 282ను తక్షణం రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. పని గంటల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సీఐటీయూ, ఇతర వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి జీవో ప్రతులను దహనం చేశారు. సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంతోష్ నగర్‌లో జీవో ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో అంబేద్కర్ చౌరస్తా వద్ద, బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట గ్రామంలోని ఎలిఫెంట్ ఎంక్లేవ్ పార్కు వద్ద జీవో కాపీలను దహనం చేశారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పరిశ్రమల ఎదుట నిరసన తెలిపారు. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో టీఎస్ ఫుడ్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో జీవో ప్రతులను దహనం చేశారు. అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద జీవో ప్రతులను సీఐటీయూ నాయకులు చించేశారు. మేడ్చల్‌లో శ్రీరామ స్పిన్నింగ్ మిల్, మెడిసిటీ సీఐటీయూ యూనియన్‌ల ఆధ్వర్యంలో, కొంపల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద మున్సిపల్ సిబ్బంది, కైతలాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద సిబ్బంది జీవో ప్రతులను దహనం చేశారు.
ఖమ్మంలో ర్యాలీ
ఖమ్మం జిల్లా మధిరలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ సెంటర్‌లో జీవో ప్రతులు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కార్యాలయం వద్ద జీవో సర్కులర్‌ను చింపి తగలబెట్టారు. భద్రాచలంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో, నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో జీవో ప్రతులను దహనం చేశారు.
ఇబ్రహీంపట్నంలో…
కార్మికుల శ్రమ దోపిడీకి గురి చేసే జీవో 282ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట, కెరమెరి మండల కేంద్రంలో, కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌చౌక్‌లో జీఓ ప్రతులను దహనం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జీఓ ప్రతులను దహనం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. తొర్రూరు పట్టణంలో, నెల్లికుదుడు మండల కేంద్రంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో, జమ్మికుంట పట్టణంలో, జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జీవో కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని, గోదావరిఖనిలో జీఓ ప్రతులను దహనం చేశారు. పలుచోట్ల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు.