– కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి
– నిరవధిక నిరసన శిబిరంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
దినసరి కార్మికులకు ఉరితాడుగా మారిన జీఓ నెంబర్ 64 ను వెంటనే రద్దు చేసి, జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేసారు. ఆశ్రమ పాఠశాలల,వసతి గృహాల దినసరి కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 11 వ రోజుకు చేరుకుంది.
ఈ నేపధ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయా ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాల్లో పనిచేస్తున్న దినసరి కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మూడు రోడ్ల కూడలిలో నిరవధిక నిరసన శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. బత్తుల శ్రీను అధ్యక్షతన జరిగిన నిరసన సభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ జేఏసీ జిల్లా నాయకులు బైట నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దినసరి కార్మికులు అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న వేతనాలను సగానికి తగ్గించడం ఏమిటని,అధికారులు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి తమ గోడు చెప్పు కున్నప్పటి కీ సమస్య ఎవరు పట్టించుకోలేదని విధి లేని పరిస్థితుల్లోనే నిరవధిక సమ్మెకు వెళ్లా మని అన్నారు.
దినసరి కార్మికులకు ప్రమాదకరం గా ఉన్న జీవో 64 ను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారమే పాత పద్ధతి లోని వేతనాలు చెల్లించాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ముర హరి,రఘు, అరుణ,రామలక్ష్మి,భద్రమ్మ, శ్రీను,పాపారావు,వెంకటేష్, కరుణాకర్,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.