– మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా బంద్
– పలుచోట్ల ర్యాలీలు
– పలువురిని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ – విలేకరులు
మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా శుక్రవారం పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఓయూ జేఏసీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆమనగల్, కడ్తాల్‌లో స్థానిక వ్యాపారులు బంద్ చేపట్టారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా తమ వ్యాపార సముదాయాలను బంద్ చేశారు. ఆమనగల్, కడ్తాల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ‘గో బ్యాక్ మార్వాడీ, మార్వాడీ వద్దు-లోకల్ ముద్దు, మన ప్రాంతం-మన వ్యాపారం’ అంటూ నినాదాలు చేశారు. ముందుగా మండల కేంద్రంలోని డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేవారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంద్ నిర్వహిస్తున్న వర్తక సంఘం నాయకులను కడ్తాల్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో స్థానిక వ్యాపారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మర్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా పట్టణ సిమెంట్, ఐరన్ హార్డ్‌వేర్, శానిటరీ, పెయింట్స్, ఫ్లైవుడ్, శానిటరీ, ఎలక్ట్రికల్ వ్యాపార సంఘాల జేఏసీ అధ్యక్షులు ఫిరోజ్, సోమ దయాకర్, వెంపటి నవీన్, భాగ్యశ్రీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దుకాణాల బంద్ నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో ‘మన ఊరు- మన దుకాణం’ నినాదంతో మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు నిరసన ర్యాలీ చేపట్టారు.
‘గో బ్యాక్ మార్వాడీ’ నినాదాలతో నిర్వహించిన బంద్‌లో భాగంగా హైదరాబాద్ హబ్సిగూడలో ఉద్రిక్తత నెలకొంది. ఓయూ జేఏసీ, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాగబోయిన పాపారావు ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మార్వాడీ గోల్డ్ షాపు ముందు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు మార్వాడీ గోబ్యాక్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న పృధ్వీని శుక్రవారం తెల్లవారు జామున నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. తెలంగాణ శ్యాంను కూడా రాత్రివేళ అరెస్టు చేసి, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఏర్ప డ్డాయి. పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.