Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీవో 25ను సవరించాలి

జీవో 25ను సవరించాలి

- Advertisement -

ప్రతి పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండాలి : కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయుల ధర్నాలు
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు
అమలు చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ-విలేకరులు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట సమితి(యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు పెద్దఎత్తున్న ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘మా సమస్యలు పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి మాట్లాడుతూ.. జీవో నెంబర్‌ 25ను సవరించాలన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలని చెప్పారు. విద్యాశాఖలో డీఈఓ నుంచి కింది స్థాయి వరకూ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ అమలు కాలేదన్నారు. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో ఇందిరాపార్కు దగ్గర పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన దర్నాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు టి.లక్ష్మారెడ్డి, వై.అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా 700 కోట్లు విడుదల చేసి బిల్లుల అమౌంట్లు అడ్జస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ కిమ్యానాయక్‌కు, డీఈఓ అబ్దుల్‌ ఘనికి వినతి పత్రాలు అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ పార్క్‌ వద్ద ధర్నా అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయ ఏఓ (పలనాధికారి) జయసుధకు వినతి పత్రాన్ని అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -