Monday, July 14, 2025
E-PAPER
Homeఆటలులక్ష్యం 193

లక్ష్యం 193

- Advertisement -

– సుందర్‌ 4 వికెట్ల మాయజాలం
– రాణించిన బుమ్రా, సిరాజ్‌
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 192/10

లార్డ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (4/22) మాయ చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌తో మొదలెట్టిన సుందర్‌..టెయిలెండర్లనూ పడగొట్టాడు. జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/38), మహ్మద్‌ సిరాజ్‌ (2/31) సైతం మెరవటంతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు కుప్పకూలింది. జో రూట్‌ (40), బెన్‌ స్టోక్స్‌ (33) రాణించగా భారత్‌కు ఇంగ్లాండ్‌ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
నవతెలంగాణ-లండన్‌
లార్డ్స్‌ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలువగా.. రెండో ఇన్నింగ్స్‌ షూటౌట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ 192 పరుగులు చేసింది. పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టసాధ్యంగా మారగా.. స్పిన్‌కు సైతం అనుకూలించటం మొదలెట్టింది. దీంతో వాషింగ్టన్‌ సుందర్‌ (4/22) ఇంగ్లాండ్‌ తోక కత్తిరించాడు. సుందర్‌ మాయజాలంతో ఇంగ్లాండ్‌ ఆఖరు 4 వికెట్లను 11 పరుగులకే కోల్పోయింది. 62.1 ఓవర్లలో ఆ జట్టు 192 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (40, 96 బంతుల్లో 1 ఫోర్‌), బెన్‌ స్టోక్స్‌ (33, 96 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఒలీ పోప్‌ (4), జేమీ స్మిత్‌ (8)లు స్వల్ప స్కోర్లకు నిష్క్రమించారు.


ఆ ఇద్దరు మెరిసినా
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (22), బెన్‌ డకెట్‌ (12) ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. ఫామ్‌లో ఉన్న ఒలీ పోప్‌ (4) సైతం తేలిపోయాడు. మహ్మద్‌ సిరాజ్‌ ఉదయం సెషన్‌ ఆరంభంలోనే ఈ ఇద్దరిని సాగనంపాడు. జాక్‌ క్రాలీని నితీశ్‌ అవుట్‌ చేయగా ఇంగ్లాండ్‌ 50/3తో నిలిచింది. ఈ దశలో జో రూట్‌ (40), హ్యారీ బ్రూక్‌ (23) నాల్గో వికెట్‌కు 41 బంతుల్లోనే 37 పరుగులు జోడించారు. ఆకాశ్‌ దీప్‌ మెరుపు వేగంతో బ్రూక్‌ వికెట్లను గిరాటేశాడు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (33)తో జతకలిసిన రూట్‌ ఐదో వికెట్‌కు 128 బంతుల్లో 67 పరుగులు జత చేశాడు. రూట్‌, స్టోక్స్‌ క్రీజులో ఉండగా ఇంగ్లాండ్‌ భారీ స్కోరు దిశగా సాగింది.
154/4తో నిలిచిన ఇంగ్లాండ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ కట్టడి చేశాడు. జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ సహా విధ్వంసకర బ్యాటర్‌ జెమీ స్మిత్‌ (8)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. సుందర్‌ మాయకు చివరి 4 వికెట్లకు 11 పరుగులకే చేజార్చుకున్న ఇంగ్లాండ్‌.. ఆఖరు ఆరు వికెట్లను 38 పరుగులకే కోల్పోయింది. టెయిలెండర్లలో క్రిస్‌ వోక్స్‌ (10) ఒక్కడే రెండెంకల స్కోరు అందుకున్నాడు. బ్రైడన్‌ కార్స్‌ (1), షోయబ్‌ బషీర్‌ (2)లు పేస్‌, స్పిన్‌కు దాసోహం అయ్యారు. పరుగుల వేట గగనమైన పిచ్‌పై భారత బౌలర్లు అంచనాలను అందుకున్నారు. 192 పరుగులకే ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ చేశారు. కానీ మన బౌలర్లు క్రమశిక్షణ పాటించలేదు. ఫలితంగా, 32 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చుకున్నారు. లార్డ్స్‌ టెస్టు ఫలితంలో ఈ ఎక్స్‌ట్రాలు కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -