– భద్రాచలానికి మరోమారు వరద ముప్పు
– ఏజెన్సీ ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు
– చెరువులకు గండ్లు పడి పంటలు నీళ్లపాలు
నవతెలంగాణ- విలేకరులు
రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్- భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండటంతో గోదావరి అంతకంతకూ పెరుగుతోంది.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామంలోని ముసళ్లకుంట గండి పడింది. 17 గ్రామపంచాయతీలలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. నగరంపల్లి గ్రామంలోని ముసళ్లకుంట కట్టకు గండి పడటంతో పంటలు నీట మునిగి కొట్టుకుపోయాయి. మోరంచ వాగు ఉప్పొంగి పొర్లడంతో పంట పొలాలు నీట మునిగాయి. మహాదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రధాన రహదారిలో గల చండ్రుపల్లి వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు గుండ్ల వాగు ప్రాజెక్ట్‌తోపాటు కుంటలు, చెరువులు మత్తడి పోశాయి. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని పరకాల పెద్ద చెరువులో సుమారు ఏడు అడుగుల మేర నీరు చేరుకుంది. పరకాల పట్టణాన్ని ఆనుకొని ప్రవహించే చలివాగు పరవళ్లు తొక్కుతోంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఖమ్మంలో మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరిగింది. కూసుమంచి మండలం పాలేరు జలాశయం నిండుకుండలా మారింది. వైరా ప్రాజెక్ట్ మరోసారి నిండి అలుగు ద్వారా భారీ మొత్తంలో కృష్ణా నదికి నీరు పరవళ్ళు తొక్కుతోంది.
గంట గంటకూ పెరుగుతున్న గోదావరి
చర్ల మండలంలోని తాళిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు 7 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీకి మరోమారు వరద భయం పట్టుకుంది. మూడ్రోజుల నుంచి శ్రీరాంసాగర్, ఇంద్రావతి, కడెం ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల కావడంతో భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకూ పెరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు వరకు 38.9 అడుగులకు చేరింది. శుక్రవారం సాయంత్రం వరకు 50 అడుగుల మార్కు దాటే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉప్పొంగుతున్న గోదావరి, పెన్‌గంగ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజుల పాటు భారీ వర్షం కురిసింది. గోదావరి, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి 2.70లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి నది ఉప్పొంగటంతో నిర్మల్ జిల్లా బాసర స్నాన ఘాట్ల వద్దకు సందర్శకులు వెళ్లకుండా నిషేధం విధించారు. నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నగరంలోని జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వట్టినాగులపల్లి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. బంట్వారం మండలంలోని నూరుల్లాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
గంట గంటకూ పెరుగుతున్న గోదావరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES