Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ పరివాహానికి గోదావరి జలాలు ఇవ్వాలి

మూసీ పరివాహానికి గోదావరి జలాలు ఇవ్వాలి

- Advertisement -

– రసాయనాల విడుదలపై చర్యలు తీసుకోకుండా ప్రక్షాళన ఎలా ?
– సుందరీకరణపై ఉన్న శ్రద్ధ ప్రక్షాళనపై లేదు : అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
– పోచంపల్లిలో ‘మూసీ ప్రక్షాళన- గోదావరి జలాల సాధన’ సదస్సు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి

విషపునీళ్లతో ఇబ్బందులు పడుతున్న మూసీ పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలివ్వాలని అఖిల భారత రైతుసంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని జీబీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం తెలంగాణ రైతుసంఘం జిల్లా మూడో మహాసభ సందర్భంగా నిర్వహించిన ‘మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన’ అనే సదస్సులో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నుంచి రసాయనాలు మూసీ కాలువలో కలుపుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సుందరీకరణపై ఉన్న శ్రద్ధ ప్రక్షాళనపై లేదని విమర్శించారు. పోచంపల్లి ప్రాంత ప్రజలు ఒకవైపు మూసీ కాలుష్యం కోరల్లో.. మరోవైపు పారా కెమికల్‌ పరిశ్రమల వల్ల భూగర్భ జలాల కలుషితంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ ప్రాంత రైతుల పంటలను కొనే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కెమికల్‌ కంపెనీలపై చర్యలు తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవన్నారు. మూసీ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, కాలుష్యం నుంచి ప్రజల జీవితాలు విముక్తి కావాలన్నా బస్వాపురం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. అందుకు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మూసీ వేదిక గౌరవ అధ్యక్షులు పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా మూసీ డంపింగ్‌ యార్డ్‌గా మారిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు మూసీ విష జలాలతో క్యాన్సర్‌, చర్మ, కిడ్నీ వ్యాధులు, రకరకాల జబ్బులకు గురవుతూ ప్రాణం పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ నీటిని శుద్ధి చేయాలంటే వెంటనే కాలువలో కత్వలపై ఈటీపీలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.జహంగీర్‌ మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి శామీర్‌పేట చెరువు నింపి.. అక్కడి నుంచి ఏదులాబాద్‌ చెరువులోకి తెచ్చి తద్వారా పిలాయపల్లి దగ్గర మూసీ ప్రాజెక్టు కాలువలో గోదావరి జలాలు వదిలితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. గోదావరి జలాల సాధన కోసం గ్రామ గ్రామాన రాజకీయాలకతీతంగా పోరాటాలకు రైతులు, ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సుకు గూడూరు బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతుసంఘం సీనియర్‌ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సీనియర్‌ న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి, నాయకులు కోట రామచంద్రారెడ్డి, మంచాల మధు, పగిళ్ల లింగారెడ్డి, దుబ్బాక జగన్‌, అందెలజ్యోతి, నెల్లికంటి జంగయ్య, వడ్డేపల్లి యాదగిరి, సామ జంగారెడ్డి, బోయపల్లి పుష్పలత, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్‌, బుగ్గ లక్ష్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -