సెమీస్‌లో జాస్మిన్ పావొలిని
జ్వెరెవ్, అల్కరాస్ సైతం..
సిన్సినాటి ఓపెన్ 2025
యుఎస్ ఓపెన్ ముంగిట సిన్సినాటి ఓపెన్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. గ్రాండ్‌స్లామ్ టైటిల్ విన్నర్, రెండో సీడ్ కొకొ గాఫ్ (యుఎస్‌ఏ) మహిళల సింగిల్స్ క్వార్టర్స్ నుంచే నిష్క్రమించగా.. అన్‌సీడెడ్, క్వాలిఫయర్ ఆటగాడు టెరెన్స్ చేతిలో ఏడో సీడ్ హోల్డర్ రూన్ (డెన్మార్క్) పరాజయం పాలయ్యాడు. జాస్మిన్ పావొలిని, ఇగా స్వైటెక్, వెరోనికా,ఎలెనా రిబకినాలు మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు.
సిన్సినాటి (యుఎస్‌ఏ)
అమెరికా యంగ్‌స్టార్, రెండో సీడ్ కొకొ గాఫ్ టైటిల్ వేటకు సిన్సినాటిలో తెరపడింది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో కొకొ గాఫ్ మూడు సెట్ల మహా పోరులో పరాజయం పాలైంది. సుమారు రెండు గంటల పాటు సాగిన క్వార్టర్‌ఫైనల్లో ఇటలీ అమ్మాయి జాస్మిన్ పావొలిని చేతిలో గాఫ్ ఓటమి చెందింది. వరల్డ్ నం.9 పావొలిని 2-6, 6-4, 6-3తో వరల్డ్ నం.2 గాఫ్‌ను ఓడించింది. తొలి సెట్లో పైచేయి సాధించిన కొకొ గాఫ్ ఆ తర్వాత వరుస సెట్లలో నిరాశపరిచింది. రెండు ఏస్‌లు, ఏడు బ్రేక్ పాయింట్లతో మెరిసినా అమెరికా అమ్మాయికి భంగపాటు తప్పలేదు. పావొలిని సైతం ఏడు బ్రేక్ పాయింట్లతో మెరిసినా.. ఓవరాల్ పాయింట్ల పరంగా 86-85తో గాఫ్ పైచేయి సాధించింది. పావొలిని, గాఫ్‌లు వరుసగా సర్వ్‌లు బ్రేక్ చేస్తూ మ్యాచ్‌లో ఉత్కంఠ రేపారు. తొలి సెట్లో చూపించిన జోరు కొకొ గాఫ్ ఆ తర్వాత సెట్లలో పునరావృతం చేయలేకపోయింది. మరో క్వార్టర్‌ఫైనల్లో వార్వరా (ఫ్రాన్స్)పై 6-1, 6-2తో రష్యా మెరుపు వెరోనిక గెలుపొందింది. నాలుగు ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో వెరోనిక చెలరేగింది. పాయింట్ల పరంగా 55-34తో తిరుగులేని విజయం ఖాతాలో వేసుకుంది. వరల్డ్ నం.3 ఇగా స్వైటెక్ (పొలాండ్) 6-3, 6-4తో అనా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 2 ఏస్‌లు, 3 బ్రేక్ పాయింట్లతో స్వైటెక్ ఆధిపత్యం చెలాయించింది. వరల్డ్ నం.1 అరినా సబలెంకకు అనూహ్య షాక్ తప్పలేదు. తొమ్మిదో సీడ్ ఎలెనా రిబకినా (ఉక్రెయిన్) చేతిలో 6-1, 6-4తో సబలెంక (బెలారస్) చేతులెత్తేసింది. 11 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లు సాధించిన రిబకినా.. సబలెంకను చిత్తు చేసింది. 4 ఏస్‌లు కొట్టిన సబలెంక ఒక్క బ్రేక్ పాయింట్ కూడా నెగ్గలేదు. పాయింట్ల పరంగా 62-45తో రిబకినా పైచేయి సాధించింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఎలెనా రిబకినా, ఇగా స్వైటెక్ తలపడనుండగా.. వెరోనికతో జాస్మిన్ పావొలిని ఢకొీట్టనుంది.
రూన్‌కు షాక్ :
23 ఏండ్ల ఫ్రాన్స్ కుర్రాడు క్వాలిఫయర్స్ నుంచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఏడో సీడ్ హోల్గర్ రూన్‌ను వరుస సెట్లలో ఓడించిన టెరెన్స్ ఆట్మానె అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏడు ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో రూన్‌ను చిత్తు చేసిన టెరెన్స్.. అత్యుత్తమ ఆటతీరుతో మెప్పించాడు. రూన్ 4 ఏస్‌లు, ఓ బ్రేక్ పాయింట్ సాధించినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరల్డ్ నం.1, వింబుల్డన్ చాంపియన్ జానిక్ సినర్ 6-0, 6-2తో ఫెలిక్స్ ఆగర్ (కెనడా)పై ఏకపక్ష విజయం సాధించాడు. వరుస సెట్లలో గెలుపొందిన సినర్ 2 ఏస్‌లు, 6 బ్రేక్ పాయింట్లతో చెలరేగాడు. పాయింట్ల పరంగా 57-27తో తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 6-2తో బెన్ షెల్టన్ (అమెరికా)పై గెలుపొందగా..రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) 6-3, 4-6, 7-5తో అండీ రూబ్లెవ్ (రష్యా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జానిక్ సినర్ (ఇటలీ)తో టెరెన్స్ (ఫ్రాన్స్) తలపడనుండగా.. జ్వెరెవ్‌తో అల్కరాస్ పోటీపడనున్నాడు.