Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకూలీ పనులకు వెళ్తూ..

కూలీ పనులకు వెళ్తూ..

- Advertisement -

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి
13 మందికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లాలో ఘటన
లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : ఎస్‌ఐ శ్రీధర్‌


నవతెలంగాణ-జైపూర్‌
పొట్ట కూటి కోసం వలసొచ్చిన మహిళా కూలీలు పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం ఎక్స్‌ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా చాందిలీబుజ్‌ గ్రామానికి చెందిన కూలీలు బొలెరో వాహనంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు వరినాట్లు వేసేందుకు వెళ్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఇందారం ఎక్స్‌ రోడ్డు వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన లారీ బొలెరోను ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరోలో ఉన్న మీనా అనిల్‌ లాటీల్‌వాల్‌(45) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది.

లీలాబాయి మండ్రె(65), విమల్‌బాయి సోయం(48) మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలోనూ అత్యధికులు మహిళలే ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది కూలీలు ఉన్నారు. లారీ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. లారీ డ్రైవర్‌ రమేశ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సీఐ నవీన్‌కుమార్‌ విచారణ చేపట్టగా, సంఘటనా స్థలాన్ని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ పరిశీలించారు. సింగరేణి జీఎం ఆఫీస్‌ దాటిన తర్వాత చెన్నూర్‌ వైపు గల రహదారి మధ్యలో డివైడర్‌ ఉండటంతో రోడ్డు ఇరుకుగా ఉంది. వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయడానికి ఇబ్బందిగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -