Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవచ్చే నెల నుంచి గ్రామాల్లోకి…

వచ్చే నెల నుంచి గ్రామాల్లోకి…

- Advertisement -

వ్యవసాయ కార్మికులను, గ్రామీణ ప్రజలను సమీకరించి సమైక్య ఉద్యమాలు
16న ఢిల్లీలో భారీ కన్వెన్షన్‌ : రాజ్యసభ సభ్యులు వి శివదాసన్‌

కడప: దేశంలోని వ్యవసాయ కార్మికులను, గ్రామీణ పేదలను, సన్న, చిన్నకారు రైతులను సమీకరించి సమైక్య ఉద్యమాలు నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ వి.శివదాసన్‌ తెలిపారు. వచ్చే అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అక్టోబర్‌లో 30 వేల గ్రామాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. హిందుత్వానికి వ్యతిరేకంగా సేవ్‌ సెక్యులరిజం పేరుతో నవంబర్‌లో 15 రోజులపాటు ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 16న ఢిల్లీలో భారీ కన్వెన్షన్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. కడపలోని హరితా హోటల్‌లో మూడ్రోజులపాటు నిర్వహించిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల ముగింపు సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.విజయరాఘవన్‌, బి.వెంకట్‌తో కలిసి బుధవారం శివదాసన్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు, మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులను క్రమేణా తగ్గిస్తూ వస్తోందన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతున్నారని, ఇందులో కార్పొరేట్లు, ధనికులకే అత్యధిక లబ్ది చేకూరుతుందని, గ్రామీణ పేదలకు ఎటువంటి లబ్ధీ ఉండదని తెలిపారు. దేశంలో పేదరికాన్ని ప్రధాని మోడీ పెంచుతున్నారే తప్ప, తగ్గించే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఫలితంగా సామాజిక అంతరాలు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, పేదలకు వ్యతిరేకమని చెప్పారు. సమాఖ్యతత్వానికి, గవర్నింగ్‌ చట్టాలకు తూట్లుపొడుస్తోందన్నారు. రాష్ట్రాల అధికారాలను కుదించడం ద్వారా వాటిని మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చుతోందని తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి విఘాతం ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని రియల్టర్లకు భూసంతర్పణ చేస్తున్నాయని విమర్శించారు.

మహాసభలో సంఘం పేరు మార్పు చేస్తాం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంజాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
అదాని స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు వెనుక ఎలక్ట్రిసిటీ ప్రయివేటీకరణ కుట్ర

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పేరును మార్చనున్నట్టు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తెలిపారు. రాబోయే మహాసభలో కొత్త పేరును ఖరారు చేసి ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ రాష్ట్రంలో అదానీ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు వెనుక ఎలక్ట్రిసిటీని ప్రయివేటుపరం చేసే కుట్ర దాగుందన్నారు. ఆ సంఘం అధ్యక్షులు కె.విజయరాఘవన్‌, రాజ్యసభ సభ్యులు శివదాసన్‌తో కలిసి కడపలోని హరితా హోటల్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు అనుమతించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ చెడ్డ వ్యక్తి అయితే, అదే పాలసీని అమలు చేస్తోన్న చంద్రబాబూ… మీరు మంచివారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జూదం, చదరంగాలను కలగలిపి ఆడుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మతోన్మాద కేంద్రంగా మార్చనుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలులో భాగంగా వివక్షాపూరిత విధానాలకు బీజేపీ పూనుకుంటోందన్నారు. కులాల, మతాల పేరిట విభజన రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఆప్ఘన్‌, పాక్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌ దేశాల్లా మార్చాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం 80 కోట్ల మంది ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోందో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం విశాఖ, కుప్పం ప్రాంతాల్లో ఎకరాను 99 పైసల చొప్పునే ఎలా కట్టబెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని తెలిపారు. విభజన హామీల్లో కేటాయించిన ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇవ్వలేదన్నారు. ఏజెన్సీలో లూటీదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులపై కుట్రలు పన్నుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad