- Advertisement -
- ఐసీఐసీఐ బ్యాంక్ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ : భారత్‌లో బంగారం ధరలు మరింత పెరగొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థం నాటికి 10 గ్రాముల పసిడి ధర రూ.1,10,000 నుంచి రూ.1,25,000 మధ్య ఉండొచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ విశ్లేషించింది. ఈ ఏడాది 2025లో రూ.99,500 – రూ.1,10,000 మధ్య కదలాడొచ్చని పేర్కొంది. ‘మా అంచనాల కంటే డాలర్‌తో రూపాయి బలహీనపడితే పసిడి ధరలు మరింత పెరగొచ్చు. ఈ కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 87.00-89.00 మధ్య సగటున ఉంటుందని భావిస్తున్నాము.’ అని ఐసీఐసీఐ రీసెర్చ్ పేర్కొంది.ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచంలో బంగారం ధరలు 33 శాతం పెరిగాయి. 2025 మిగిలిన కాలంలో ఔన్సు పసిడి ధర సగటున 3,400-3,600 మధ్య, 2026 మొదటి అర్ధభాగంలో 3,600-3,800 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమైతే ఈ ధరలు మరింత పెరగొచ్చని హెచ్చరించింది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.880 పెరిగి రూ.1,07,120కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.800 పెరిగి రూ.98,200గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.900 పెరిగి రూ.1,27,000కు చేరింది.
- Advertisement -