Wednesday, October 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రపంచ అప్పుకు బంగారం ధరలకు ముడి!

ప్రపంచ అప్పుకు బంగారం ధరలకు ముడి!

- Advertisement -

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళ్తే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జీడీపీ నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది.

అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకుని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రూ.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రూ.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రూ.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రూ.12.76లక్షల కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రూ.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రూ.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.

గ్రామీణ ప్రాం తాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రూ.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటు బడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో ఎనభై శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిల్‌పై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రూ.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తర్వాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రూ.2,73,684 కోట్లకు తగ్గించారు.

యేటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రయివేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది.

రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రూ.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రూ.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాథమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్నాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది. ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జీడీపీకి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది.

అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జీడీపీకి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమాన దేశాల రుణభారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి.

ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జీడీపీ చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జీడీపీలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశాలూ,వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920 దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీనోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది.

ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోష్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరోమీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాల్లో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జీడీపీలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -