ఉన్నత విద్య, మంచి ఉద్యోగం అంటే జీవితానికి అన్నీ సమకూరినట్టే అనే భ్రమలో మన యువత ఉంది. కానీ వాస్తవంగా, అధిక వేతనాలు అందుకుంటున్న యువ నిపుణులే వేగంగా మానసిక ఆందో ళనతో సతమతమవుతున్నారు. ”నాకు అస్సలు తీరిక లేదు” అనే మాట కార్పొరేట్ వర్గాలలో ఒక గౌరవ ముద్రగా మారింది. అత్యధిక ధనం ఉన్నా, నిశ్శబ్దంగా ఏకాంతాన్ని కోల్పోతున్న ఈ పరిస్థితిని ‘బంగారు పంజరం’ అని పిలవక తప్పదు. చైనాలోని ‘996’ (పని విధానం), జపాన్‌లోని ‘కరోషి’ (అధిక పనిభారం వల్ల మరణం) వంటి విషాదాలు భారత కార్పొరేట్ రంగంలో గుట్టుగా విస్తరిస్తున్నాయి. ప్రతిభకు, శ్రమకు విలువ ఇస్తున్న చోట, మానవత్వానికి విలువ కొరవడి నప్పుడు, ఈ పోరాటం కేవలం పని గడువులతోనే కాదు, మన జీవిత లక్ష్యాలతోనూ మొదలవుతుంది. ఈ విషపూరిత వాతా వరణం మానసిక ఒత్తిడిని పెంచి, ఉద్యోగిని డబ్బు దాస్యంలో బంధిస్తూ, శ్రమ దోపిడీని కొత్త పంథాలో నడుపుతోంది.
స్వీయరక్షణే కార్మిక హక్కు
ఇంటి నుండే పని విధానం.. సౌకర్యాన్ని ఇచ్చినా, స్వేచ్ఛను హరించి వేసింది. కార్యాలయం, ఇల్లు అనే శారీరక సరి హద్దులు పూర్తిగా చెరిగి పోయాయి. ఒక ఉన్నతాధికారి అర్థరాత్రి పంపే సందేశం, ఉద్యోగి కుటుంబంతో గడపాల్సిన శాంతి కాలాన్ని క్షణాల్లో నాశనం చేస్తుంది. పరిశోధనల ప్రకారం, ఇంటి నుండి పనిచేసే ఉద్యోగులు సగటున 2 నుంచి 3 గంటలు ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ ఒత్తిడి, అధిక పని భారానికి ప్రభుత్వం లేదా సంస్థల నుండి పరిష్కారం వస్తుందని నిరీక్షించడం అవివేకం. అందుకే, ప్రతి ఉద్యోగి తన ‘స్వీయ-రక్షణ’ గురించి తప్పక ఆలోచించాలి. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆఫీసుకు సంబంధించిన సందేశాలను చూడక పోవడం, వారాంతాల్లో ఒక రోజు పూర్తిగా సాంకేతిక దూరం (ఫోన్లు, కంప్యూటర్లు వాడకపోవడం) పాటించడం వంటి కఠినమైన హద్దులను మీరే గీసుకోవాలి. సంతోషంగా ఉన్న ఉద్యోగి, ఒత్తిడిలో ఉన్న ఉద్యోగి కంటే ఇరవై ఒక శాతం ఎక్కువ ఉత్పాదకతను ఇస్తారన్న నిజాన్ని సంస్థలు గుర్తించాలి.
అలసటను తరిమే అభిరుచి
తీవ్రమైన అలసటను జయించడానికి ఉన్న ఏకైక మార్గం మన నిజమైన అభిరుచిని కనుగొనడం. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే తన ఉన్నత విద్య తర్వాత కూడా, ఎక్కువ వేతనాల ఉద్యోగాన్ని వదిలి, తన ఇష్టమైన వ్యాఖ్యానం వైపు వచ్చారు. ఇష్టమైన రంగంలోకి ప్రవేశించడానికి ఎప్పుడూ పెద్ద సాహసం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుత ఆదాయానికి భద్రత కల్పిస్తూనే, అభిరుచికి సంబంధించిన పనిని అదనపు ప్రయత్నాలుగా మొదలుపెట్టాలి. చేసేపని మీకు ఆనందాన్ని ఇస్తే, కష్టపడటం అనేది ప్రయాణం అవుతుంది. అదే పని మీకు భయాన్ని ఇస్తే, కష్టపడటం అనేది శిక్ష అవుతుంది. మనకు నచ్చిన రంగంలో పనిచేస్తే, మనం డబ్బు కోసం పనిచేస్తున్నట్లు అనిపించదు. ఈ ఆత్మ సంతృప్తే తీవ్రమైన అలసటను శాశ్వతంగా దూరం చేస్తుంది.
బానిస సంకెళ్లు తెంచండి!
మీరు మీ సంస్థ పనులకు ఎంత సమయం, శక్తిని కేటాయిస్తున్నారో, మీ వ్యక్తిగత జీవిత లక్ష్యాలకు కూడా అంతే శక్తిని కేటాయించండి. మీరు కార్యాలయంలో ఇతరులకు నాయకులు కావచ్చు, కానీ మీ ఆరోగ్యానికి, ఆనందానికి నిజమైన నాయకులు, యజమానులు మీరే. మీ జీవితం ఎంతో విలువైనది. ఏ కంపెనీ, ఏ జీతం కూడా మీ శాశ్వత సంతోషాన్ని కొనలేదు. అందుకే, నేటి నుండే మీ సరిహద్దులను గీయండి, మీ ఆసక్తిని అనుసరించండి, దీనికి మీరే బాధ్యత వహించడం తీసుకోండి. చాలా ఆలస్యం కాకముందే, ఈ ‘బంగారు పంజరం’ సంకెళ్లను తెంచుకొని, నిజమైన శ్రమస్వేచ్ఛ వైపు ధైర్యంగా అడుగులు వేయండి.
ఫిరోజ్ ఖాన్
9640466464