Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలకు సుపరిపాలన అందించాలి

ప్రజలకు సుపరిపాలన అందించాలి

- Advertisement -

ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేలా అంకితభావంతో పనిచేయాలి : జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి జయేష్‌ రంజన్‌
ట్రై కార్పొరేషన్‌లో తొలి సాధారణ స్టాండింగ్‌ కమిటీ సమావేశం
ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500కోట్లు కేటాయింపు


నవతెలంగాణ-సిటీబ్యూరో
ట్రై కార్పొరేషన్‌ (మూడు కార్పొరేషన్లు) ప్రజలకు సుపరిపాలన అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ అనంతరం గురువారం తొలి సాధారణ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ట్రై కార్పొరేషన్‌లో జరిగింది. న్యాక్‌లోని సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన తొలి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ హెడ్‌ఆఫీస్‌లో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి అధ్యక్షతన మొట్టమొదటి స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు ఎజెండా అంశాలపై చర్చించారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (సీయూఆర్‌ఈ) పునర్వ్యవస్థీకరణ, సైబరాబాద్‌, మల్కాజిగిరి, గ్రేటర్‌ హైదరాబాద్‌గా మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటు, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగింపుతోపాటు ప్రతి కార్పొరేషన్‌కు ప్రత్యేక కార్పొరేట్‌ హోదా, చట్టబద్ధ హక్కులు, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సిబ్బంది కేటాయింపుపై చర్చించారు. సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లకు తలా రూ.500 కోట్ల చొప్పున బడ్జెట్‌ కేటాయింపు వంటి మూడు ప్రతిపాదనలకు స్టాండింగ్‌ కమిటీ అమోదం తెలిపింది.

అనంతరం పారిశుధ్య, ఘన వ్యర్ధాల నిర్వహణ, డంపింగ్‌ యార్డులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, వాటర్‌ లాగింగ్‌ పాయింట్‌లు, పరిష్కారం, మౌలిక సదుపాయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లకు సిబ్బంది కేటాయింపు, ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, హెచ్‌-సిటీ, మాన్‌ సూన్‌ సన్నద్ధత, వీధి లైట్ల పనితీరు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెస్పాన్స్‌ మెకానిజం, రోడ్‌ సెప్టీ డ్రైవ్‌ వంటి పనుల పురోగతిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వీ కర్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తూ ఆరు నెలల్లో ఈ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఎన్నడూ చేయలేని విధంగా ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా ప్రభావవంతంగా పని చేయాలన్నారు.

సీజీజీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌
జీహెచ్‌ఎంసీ మూడు కార్పొరేషన్‌లుగా పునర్వ్యవస్థీకరణ అయిన నేపథ్యంలో అస్సెట్‌, లయబిలిటీలు, మ్యాన్‌ పవర్‌ను తార్కికంగా మూడు కార్పొరేషన్‌లకు కేటాయించేందుకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్టు ప్రత్యేక అధికారి తెలిపారు. కేటాయింపులు, ఒప్పందాలు వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి శాస్త్రీయంగా కేటాయింపులు వచ్చే 10 రోజుల్లో టాస్క్‌ఫోర్స్‌ చేయనుందని తెలిపారు.

ఇన్‌స్టంట్‌ రిజల్ట్స్‌.. విజిబుల్‌ ఇంపాక్ట్‌
ఐటీ సహా కొన్ని శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన ఫలితాలు రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సి వస్తుందని ప్రత్యేక అధికారి జయేష్‌ రంజన్‌ అన్నారు. కార్పొరేషన్‌లో చక్కగా పనిచేస్తే చాలా మటుకు ఇన్‌స్టంట్‌ రిజల్ట్స్‌, విజిబుల్‌ ఇంపాక్ట్‌ ఉంటుందన్నారు. అర్బన్‌ గవర్నెన్స్‌లో మార్పు తెచ్చేందుకు ఆరు నెలలు సమయం సరిపోతుందని తెలిపారు. ప్రభుత్వ సహకారంతోపాటు కమిషనర్‌ ఆర్‌.వీ కర్ణన్‌ నేతృత్వంలో గుడ్‌ లీడర్‌ షిప్‌ ఉందన్నారు. క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను తీసుకొచ్చేందుకు అంకితభావంతో కృషి చేయాలన్నారు.

పారిశుధ్య పోటీలు..
పారిశుధ్యం మరింత మెరుగుపరిచేందుకు మూడు కార్పొరేషన్లకు పారిశుధ్యం అంశంలో పోటీలను నిర్వహించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. గార్బేజీ వల్నరబుల్‌ పాయింట్‌ లేని వార్డులు, సర్కిల్‌, కార్పొరేషన్లను తీర్చిదిద్దిన అధికారులకు ప్రశంస పత్రాలు, ఆర్థిక నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. ఈ అంశాల్లో క్రియాశీలక భాగస్వామ్యమైన కార్పొరేటర్లు, ఎన్జీవోలు, అధికారులు, వ్యక్తులకు కూడా ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, అదనపు కమిషనర్‌లు కే.ఏ మంగతాయారు, కే. సత్యనారాయణ, జోనల్‌ కమిషనర్లు అనురాగ్‌ జయంతి, ప్రియాంక అల, ఎన్‌ రవికిరణ్‌, ఎస్‌ శ్రీనివాసరెడ్డి, జీ.ముకుంద రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ రత్నాకర్‌, సీసీపీ కే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -