Saturday, April 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

- Advertisement -

మరోసారి డీఏ పెంచిన ప్రభుత్వం

నవతెంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 క్యాలెండర్‌ సంవత్సరం నుంచి డీఏను 2.1 శాతం పెంచుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఇంతకు ముందు 50.7 శాతంగా ఉన్న డీఏను ఇప్పుడు 52.8 శాతానికి పెంచారు. పెరిగిన ఈ డీఏ జనవరి ఒకటి 2026 నుంచి అమలులోకి వస్తుంది. గత మూడు నెలల డీఏ బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ఒక్కో నెలకు చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ డీఏ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు.

గత ఏడాది జూలై 2025లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంచిన విషయం తెలిసిందే. 48.6 శాతం నుంచి 50.7 శాతానికి ప్రభుత్వం డీఏను పెంచింది. ప్రస్తుతం మరో 2.1 శాతం పెంపుతో డీఏ 52.8 శాతానికి చేరుకుంది. మే 2024లో ఆర్‌పీఎస్‌-2017 అమలు తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ బకాయిలు లేవని అధికారులు స్పష్టం చేశారు. డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం
ఈ సందర్భంగా ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై రీజియన్‌ మేనేజర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఏకైక పెండింగ్‌ డీఏను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. జనవరి 2026 నుంచి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చిందనీ, దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరిందన్నారు. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్‌ డీఏలు భవిష్యత్తులో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కేంద్రంగా పని చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఆర్టీసీలో కార్మికుల సంక్షేమం కోసం ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌, కారుణ్య నియామకాలు, తొలగించిన ఉద్యోగులను త్రిమెన్‌ కమిటీ ద్వారా తిరిగి నియమించడం, కొత్త రిక్రూట్‌మెంటు, కొత్త బస్సుల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. తెలంగాణలో లైఫ్‌లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వివరించారు.

మా ధ్యేయం అదే: ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీ సిబ్బంది ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోషంగా ఉందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి చెప్పారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. డీఏ పెంపుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈడీలు సీహెచ్‌ వెంకన్న, ఖుస్రో షా ఖాన్‌, రాజశేఖర్‌, సాల్మన్‌, ఎఫ్‌ఏ విజయపుష్ప, సీడీఎం శ్రీధర్‌, సీపీఎం ఉషాదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -