Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజివీడ్కోలు...ఛీడ్కోలు

వీడ్కోలు…ఛీడ్కోలు

- Advertisement -

నేను ఆమధ్య హిమాలయాలకు పోయాను అక్కడ యతిని చూశాను, నా ముందే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఒక గుహలోకి పోయింది. పాదాల అడుగులు పడ్డచోట గుంతల్లాగా అచ్చులు పడ్డాయి. మామూలు మనిషి పాదాలకంటే ఓ నాలుగు రెట్లు పెద్దగా ఉన్నాయవి అన్న వార్తలు ఓ నలభై యాభై సంవత్సరాలముందు వినేవాళ్లం. ఇప్పుడంటే యతి అని గూగుల్‌ తల్లినో, ఏ.ఐనో అడిగితే ఇంతింత సమాచారం ఇస్తాయి. ఇక బాగా ముందుకొచ్చి చూస్తే, నేను హిమాలయాల్లోకి పోయినప్పుడు ఒక మునిని చూశాను ఆయనకు జుట్టు బాగా పెరిగిపోయింది, గోర్లు కూడా పెద్ద పెద్దగా పెరిగి ముడుచుకుపోయి ఉన్నాయి. మనకంటే వేగంగా అడుగులేసుకుంటూ పోతుంటే పరుగు పరుగున అతణ్ణి కలుసుకొని వయస్సెంత అనడిగితే ఐదువందల సంవత్సరాలకంటే ఎక్కువే చెప్పాడు. ఏమి తింటారని అడిగితే ఒక నాలుగువందల సంవత్సరాలకు పూర్వం తిన్నాను ఆ తరువాత అలాగే ఉన్నాను. గాలిలో ఉన్న పదార్థాలే నా ఆహారం అని చెప్పాడు. మేమూ మీలా కావాలంటే ఏమిచేయాలి అంటే దానికి సాధన చాలా కావాలి అని ఎన్నో సంవత్సరాలు తపస్సు లేదా ధ్యానం చేయాలని ఇంకా ఇంకా ఎన్నో చెబుతారు. ఫొటో తీయలేదా అంటే ఆయన వద్దన్నాడనో, లేదా తీసినా రాలేదనో చెప్పొచ్చు. ఒక సెల్ఫీ చూపి తమపక్కన తెల్లగా మనిషి ఆకారంలో ఉన్నది ఆయనే అనీ జవీఅసు సినిమాలోలా చెప్పి తప్పించుకోవచ్చు కూడా. ఈయనదేముందిలే డెబ్భై దాటాడు వచ్చే ఎన్నికలకు ఉంటాడో లేదో అన్న ఒక చిన్నాయన మాటలకు సమాధానంగా అసలు మనిషి ఆయుర్ధాయం నూట ఇరవై ఏండ్లని ఈమధ్యనే ఒక పెద్దాయన సెలవిచ్చారు. మంచి మందులు దొరుకుతున్నాయి, వైద్యం అందుబాటులో ఉంది అంటే అది వేరే విషయం ఆయన సనాతనవాదంలోకి పోయి పూర్వం, పూర్వం అనుకుంటూ ఇవన్నీ చెబుతున్నాడు. సంజీవని తెచ్చి అందరికీ పంచుతానంటున్నాడు.

ఏ ఉద్యోగంలో చేరినా వయసు ప్రకారం ఉద్యోగ విరమణ తప్పదు. ఇక్కడ ఉద్యోగ విరమణ పదవీ విరమణ అన్నవి వేరువేరని తెలుసుకోవాలి. ఉద్యోగమంటే ప్రభుత్వ లేదా ప్రయివేటు ఉద్యోగం. పదవి అంటే రాజకీయ పదవి అని వేరే చెప్పనవసరం లేదు. లేదా రాజకీయాల్లోంచి వచ్చి, ఎంత హోదాలో ఉన్నా ఆ రాజకీయులకు సహకరించి చేసిన పాత సేవలకుగాను మెచ్చి ఇచే పదవులు కూడా ఉన్నాయని, ఉంటాయని వార్తలు విశేషాలు చూసేవారికి బాగా తెలుసు. డెబ్భై ఐదేండ్లు పెట్టుకున్న వయసుపరిమితిని ఒక పెద్దాయనకు తప్ప అందరికీ అన్వయిస్తున్నారని జనాలు గుసగుసలాడుకోవడమే కాదు బాహాటంగా అరుస్తున్నారు కూడా. ఈలోపల నూట ఇరవై ఫార్ములా తెచ్చిన ఒక ముఖ్యమైన మనిషి ఇంకో మాట కూడా అనొచ్చు. అదేమంటే తొంభై, లేదా వంద ఏండ్లు బతుకుతారనుకుంటే డెబ్భై ఐదేండ్లు పదవిలో ఉండొచ్చు, అదే నూట ఇరవై అనుకొండి, అది ఎనభై ఐదు దాకా పోతుంది. కాబట్టి వయసు అడ్డంకి కాదు, మనసే అడ్డంకి. ఈలోగా పక్కనున్న మిత్ర ముఖ్యమంత్రి వచ్చి మీరు ఎవ్వరికి ఆ సంజీవని తినిపించి నూట ఇరవై ఏండ్లు చేసినా చేయండి కాని మా మాజీకి మాత్రం చేయకండి. ఆయన మీమీద కూడా చాలా విమర్శలు చేశాడన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు నూట ఇరవ కాక పోతే రెండువందల నలభై చేసుకోండి, మా రాష్ట్రాన్ని మాత్రం తాకవద్దు. మనమిద్దరమూ కోటుకు కోటు విషయంలో కూడా మిత్రులం కదా, కాబట్టి నేనే మీకు ముఖ్యమని మరవొద్దు అనొచ్చు. ఇక ప్రధాని కాగోరే యువకుడొచ్చి, బాబూజీ, మీరు మిత్రులుగా ఉండండి, ప్రభుత్వాలు నడుపుకొండి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా మీ ఇష్టం, కాని పెద్దాయనకు మాత్రం ఈ నూట ఇరవై చేయకండి. మీరు అలా చేసుకుంటూ పోతే మీ సుపుత్రుడు కూడా భవిష్యత్తులో బాధపడతాడని మరవొద్దు.

ఇంకా మనవడు కూడా అన్న విషయం మరవొద్దు అని వాపోతాడు. ఈ లోపల కేంద్ర ఆర్థికమంత్రి, రాష్ట్రాల ఆర్థికమంత్రులు డైరెక్టుగా రావచ్చు లేదా ఫోను ద్వారానైనా వెంటనే తమ తమ ఉద్యోగులకు ఆ సంజీవని తినిపించి నూట ఇరవై చేసేస్తే మీకు రుణపడి ఉంటాము, అంతే కాదు మాకొచ్చే రుణాల్లో మీ రాష్ట్రానికీ కొంత ఇస్తాము, వడ్డీ మేమే కట్టుకుంటాము అనొచ్చు. అప్పుడు ఉద్యోగులకు రిటైర్మెంట్‌ వయస్సు ఎనభై చేస్తే వాళ్లకు రావలసిన పెన్షన్‌, పీ.ఎఫ్‌ మొదలైనవి ఇంకో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటే అలా ఆలస్యం చేయొచ్చునని ప్రణాళికలు వేయవచ్చు. అప్పుడు సంజీవని పెద్దా యన ఆలోచనలో పడతాడు. నేనేదో రామర్‌ పిళ్ళై పెట్రోలు లాగా సంజీవని పేరు చెబితే ఇంత రభస జరుగుతుందా అనుకొని అంతా ఉత్తుత్తిదే అని చెబితే పోలా అని కొడుకు విశ్వేష్‌ను సలహా అడుగుతాడు. వద్దు నాన్నా అలా చెబితే మన మీదున్న రెప్యుటేషన్‌ తగ్గుతుంది. అందుకే అంచెలంచెలుగా పది, పది సంవత్సరాలు పెంచే పద్ధతిలో పోతున్నాను అని మరో గాలివార్త వదలండి అని సలహా ఇస్తాడు. పుత్రో త్సాహము పుత్రుడు జన్మించినపుడు కాదు అన్న పద్యం మననం చేసుకొని ఉప్పొంగిపోయి అలాగే చేస్తాడు సంజీవని బాబు. అప్పుడే సంజీవని బాబుకు ఎవరో మాట్లాడినట్లు వినిపించి చెవులు రిక్కించి వింటాడు. ‘ఒక వయస్సు వచ్చాక మర్యాదగా వీడ్కోలు తీసుకోవాలి అంతే కాని ఇలా వయస్సులు పెంచుకుంటూ పోతే భూమి మీద మనుషులెక్కువై పథకాలు ఎక్కువ చేయవలసి వస్తుంది, జాగ్రత్తగా ఉండు’ అంటుంది ఆ కనబడని వాణి. ఈగొంతు ఎక్కడో విన్నానే అనుకొని, ఆ గుర్తొచ్చింది ముసలాయన మళ్లీ వచ్చే ఎన్నికలదాకా ఉంటాడో ఊడతాడో అన్న గొంతులాగే ఉందది.ఆ రాష్ట్రంలో కాని ఈ రాష్ట్రంలో కాని జనాలు చట్టసభలకు వస్తే ఈ గొంతులు గుర్తుపెట్టుకోవచ్చు అనీ అనుకుంటాడు. అందుకే ఛీడ్కోలు వద్దు బాబూ మంచి వీడ్కోలే మంచిది అని, ఆ విషయం చెబుదామని కేంద్రంలోని పెద్దాయనకు ఫోన్‌ కలపమంటాడు.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad