ప్రభుత్వ సంస్థను కాదని ప్రయివేటు కంపెనీకి అందలం
కేంద్రం డిజిటల్ రాజీ
ప్రభుత్వ అధికారిక
ఈ-మెయిల్ వ్యవస్థ షిఫ్ట్
జోహౌలో లక్షల సంఖ్యలో ఖాతాలు నమోదు
పీఎంఓ, మంత్రిత్వ శాఖలు సహా
12 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ
ఈ-మెయిల్ అకౌంట్లు
పారదర్శకత, సమాచార గోప్యత, భద్రతకు ప్రమాదం : మేధావులు,
టెక్ నిపుణుల హెచ్చరికలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వ అధికార సమాచారం, వ్యక్తిగత గోప్యత చాలా కీలకం, సున్నితమైనది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం డిజిటల్ సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలి. దీనర్థం.. దేశం తన డేటా, వ్యవస్థలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండటం. కానీ మోడీ సర్కారు జోహౌ లాంటి ప్రయివేటు కంపెనీకి ప్రభుత్వ ఈ-మెయిల్ వ్యవస్థను అప్పగించడమంటే ఆ నియంత్రణను కోల్పోవడమేనని మేధావులు, నిపుణులు చెప్తున్నారు. కంపెనీ భారత్‌కు చెందినది అయినంత మాత్రానా అది డిజిటల్ సార్వభౌమత్వం కిందకు రాదనీ, ఇక్కడ నియంత్రణ అనేది ముఖ్యమని అంటున్నారు.
ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీ
ఎన్‌ఐసీ అనేది కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. దీనిని 1976లో స్థాపించారు. అప్పటి నుంచి ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలకు వెన్నెముకలా పని చేస్తోంది. అలాంటి ప్రభుత్వ సంస్థను కేంద్రం మరింత ఆధునీకరించి, మెరుగుపర్చాలి. దాని సేవలను వినియోగించుకోవాలి. కానీ మోడీ సర్కారు అలా చేయలేదు. జోహౌతో ఒప్పందం చేసుకున్నది. కేంద్రం ఈ చర్య.. ఎన్‌ఐసీ మనోబలాన్ని దెబ్బ తీసేలా ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
‘నమ్మకమే’ ఆధారం.. పారదర్శకతకు లేని గ్యారెంటీ
‘ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్’ను వాడకూడదనీ, అది సెక్యూరిటీ రిస్క్ అని ప్రభుత్వం వాదిస్తున్నది. కానీ ప్రపంచంలోని ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాలతో పాటు కేరళ రాష్ట్రం ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను వాడి పారదర్శకతను పెంచుతున్నాయి. జోహౌ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రయివేటు కంపెనీల సాఫ్ట్‌వేర్‌లు పూర్తిగా వాటి నియంత్రణలోనే ఉంటాయి. వాటి సోర్స్ కోడ్ (అసలు ప్రోగ్రామింగ్) ప్రభుత్వానికి కూడా కనబడదు. దీంతో పరిరక్షించే అవకాశం ఉండదు. కాబట్టి అవి ఎలా పని చేస్తున్నాయో, ఎలాంటి సెక్యూరిటీ లోపాలు ఉన్నాయో ప్రభుత్వం చూడలేదు. కాబట్టి వాటి వ్యవస్థలను కేవలం నమ్మకం, విశ్వాసం ఆధారంగానే ప్రభుత్వం ఉపయోగిస్తుండటం గమనార్హం. కాబట్టి ఇవి(కంపెనీల సాఫ్ట్‌వేర్‌లు) బ్లాక్‌బాక్స్ వంటివనీ, లోపల ఏముందో తెలియదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పారదర్శకతకు ముప్పు వాటిల్లే ప్రమాదం అధికంగా ఉంటుందని అంటున్నారు.
జోహౌను ఎంచుకోవడం స్వావలంబన కాదు
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో గల బీజేపీ సర్కారు.. స్వదేశీ నినాదాన్ని ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన జోహౌకు విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నది. భారత్‌కు చెందిన ఏ కంపెనీ, సంస్థ అయినా.. అది సార్వభౌమత్వం, స్వావలంబనకు నిదర్శనమనేలా చూపిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ-మెయిల్ వ్యవస్థను కేంద్రం జోహౌకు కట్టబెట్టింది. జోహౌ ఒక భారతీయ కంపెనీయే అయినా అది ప్రయివేటు, లాభాపేక్ష గల సంస్థ అన్న విషయాన్ని మరవద్దని మేధావులు, టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్‌ఐసీ అనేది దేశ ప్రయోజనం కోసం పని చేసే ప్రభుత్వ సంస్థ అని గుర్తు చేస్తున్నారు. కాబట్టి జోహౌను ఎంచుకోవడం స్వావలంబన కాదని వారు ఆరోపిస్తున్నారు.
మోడీ సర్కారు స్పష్టతనివ్వాలి
తాము వినియోగదారుల డేటాను తాకబోమనీ, నమ్మకమే మా బలమని జోహౌ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అంటున్నారు. అయితే ప్రభుత్వ రహస్య డేటా విషయంలో నమ్మకం ఒక్కటే సరిపోదనీ, టెక్నికల్ గ్యారెంటీ, ఆడిట్, ఎన్‌క్రిప్షన్ అవసరమని మేధావులు, టెక్ నిపుణులు చెప్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు జోహౌకు మారినట్టు పబ్లిక్‌గా ప్రకటించడంతో కంపెనీకి అధికారిక ప్రమోషన్ ఇమేజ్ వచ్చింది. జోహౌ వ్యవస్థాపకుడు గతంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డ్ (ఎన్‌ఎస్‌ఏబీ) సభ్యుడు కూడా. కాబట్టి ప్రభుత్వ నియంత్రిత సంస్థలో సభ్యుడిగా చేసిన ఆయనకు, తాజా పరిణామాలకు మధ్య గల సంబంధంపై మోడీ సర్కారు ప్రజలకు మరింత స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మేధావులు వాదిస్తున్నారు.
స్వదేశీ సాంకేతికత నినాదం పేరుతో జోహౌ అనే భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీకి విపరీత ప్రచారమే జరిగింది. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కారు కృషి కూడా తీవ్రంగానే ఉన్నది. ప్రముఖ సామాజిక మాధ్యమాల స్థానంలో జోహౌ నుంచి వచ్చిన అప్లికేషన్ల వినియోగం ఈ మధ్య పెరిగిపోయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం తన అధికారిక ఈ-మెయిల్ వ్యవస్థను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) నుంచి జోహౌకు మార్చింది. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ), ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, అధికారిక విభాగాలు సహా 12 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఈమెయిల్ ఖాతాలు జోహౌకు మారాయి. ‘స్వదేశీ’ పేరుతో జరిగిన తాజా పరిణామం అనేక అనుమానాలు, ఆందోళనలను కలిగిస్తున్నది. ప్రయివేటు సంస్థపై ఆధారపడటాన్ని పలువురు మేధావులు, నిపుణులు తప్పుబడుతున్నారు. మోడీ సర్కారు చర్య ‘డిజిటల్ స్వావలంబన’ కాదనీ, ‘డిజిటల్ నియంత్రణను వదిలివేయడం (సరెండర్)’ అని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం రాజీ పడిందని స్పష్టమవుతున్నదని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక సమాచార భద్రత, గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జోహోకు సై..ఎన్‌ఐసీకి బై బై
- Advertisement -
- Advertisement -



