పెట్టుబడులకు ముఖద్వారం మన రాజధాని. ప్రపంచం మొత్తం మనవైపే చూస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు మనపై దృష్టి పెట్టాయి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో, లేదా మంత్రో, ప్రధాన మంత్రో, కేంద్ర మంత్రో అన్న తేడా లేకుండా అందరూ అనే మాట. అసలు ఈ ముఖద్వారాన్ని తెరిచిందే నేను, ఇక్కడ హైటెక్ సిటీని కట్టిందే నేను అని ఇంకో పెద్దాయన సెలవివ్వనూ వచ్చు. ఏదేమైనా భావి భారత నిర్మాత నెహ్రూ అంటే ఒప్పుకోనోళ్లు ఇంకొకరిని చూసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నాల్లో కొందరిని తెరపైకి తెచ్చి, లేనోళ్లనెందుకు అసలు ఉన్నోళ్లలో ఎవరినైనా పైకి తెస్తే సరిపోదా, వేరెవరినో ఎందుకు నన్ను నేనే పొగుడుకుంటూ పోతే సరిపోదా, అప్పుడు నేనే నెహ్రూను దాటొచ్చు కదా అనీ లోలోపల అనుకోనూ వచ్చు. ఎంతైనా ప్రచార యుగం ఇది. ప్రపంచీకరణ యుగం ఇది. రోజుకో యాప్ వచ్చే సోఫిస్టికేటెడ్ వరల్డ్ లో ఉన్నాం. గుర్తుపెట్టుకొండి.
అంతర్జాతీయ నగరంగానే కాదు అంతర్జాతీయ పేర్లు కూడా పెడతామని ఊరిస్తున్నారు. ఇప్పటికే మెట్రోస్టేషన్లకి పేర్ల ముందు ఆసుపత్రుల పేర్లు, ఇతర వ్యాపార సంస్థల పేర్లు పెడుతున్నారు. త్వరలో గూగుల్ మార్గ్ అని, మెటా ఏ.ఐ రహదారి అని, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ రోడ్ అని కొత్త కొత్త పేర్లు వినే అవకాశం, అదృష్టం నగరవాసులకు కలగనుంది. ఇండిస్టియల్ కారిడార్ అన్నా, హబ్బులన్నా అవి ఎవరికోసమో వాళ్లకు అన్నీ అందుతాయి. ఇన్నిన్ని ఉద్యోగాలొస్తాయి అన్నోళ్లు తర్వాత మాట మార్చి ఉద్యోగ అవకాశాలు అంటారు. ఆ కారిడార్లు, హబ్బులు ఉన్నచోట బజ్జీల బండ్లు, టీ స్టాళ్లులాంటివి పెట్టినోళ్లకు కూడా వీళ్లు ఉద్యోగాలిచ్చినట్టే చెబుతారు తరువాత.
2047 మాత్రం మారదు ఏ ఒక్క నాయకుడు 2030 అనో, 2037 అనో అనడం లేదు. అందరూ ఒకే పాట 2047 అనే రాజకీయ పాట. మేము చేసినవి కనపడాలంటే వరుసగా ఓ ముప్ఫై సంవత్సరాలు మమ్మల్నే ఎన్నుకొండి, లేదంటే మధ్యలో వచ్చేవాళ్లు మేము చేస్తున్న పనుల్ని మధ్యలో ఆపేసి వేరే పనులు మొదలుపెడతారని అందుకే మేమే రావాలని కుర్చీపట్టుకుని వేలాడతామంటారు. ఈయన ఉన్నత వరకూ ఈయనే ముఖ్యమంత్రి అన్న మాటల్ని ప్రజలెప్పుడో అవతలపడేశారు ఆ నాయకులతో పాటు. ఆ 2047 తరువాత 2097గా మారి ఆ తరువాత 2147 అవుతుంది. ఇది ప్రజల అనుభవంలో తేలిన విషయం.
చైనా ప్లస్ వన్ ఇప్పుడు వ్యాపారంలో, అదే అంతర్జాతీయ వ్యాపారంలో ఒక కొత్త ఎత్తుగడ. ఎవరి కంపెనీ అయినా చైనాలో ఉండొచ్చు. దాంతో పాటు ఇంకో దేశంలో ఆ వ్యాపారం విస్తరిస్తూ ఉండాలి. అప్పుడు చైనా మీద ఆధారపడడం తగ్గించవచ్చునన్నది ఇక్కడ పాయింటు. ఇంకొన్ని రోజులకు జపాన్ ప్లస్ వన్ అని, అమెరికా ప్లస్ వన్ అనీ ప్రయోగాలు చేయవచ్చు.అసలు భారత్ ప్లస్ వన్ అని అందరూ మనతో పోటీ పడే రోజులు రానున్నాయని ఇంకో పెద్దాయన సెలవివ్వనూ వచ్చు. వ్యాపారవర్గాలనంతా కూచోబెట్టిన ఒక ఛోటానాయకుడు మా రాష్ట్రం పెట్టుబడులకు గేట్ వే అంటాడు సడెన్‌గా. నీది గేట్ వే కావచ్చు మాది ఇండియా గేట్ అని ఒకరు, గేట్ వే ఆఫ్ ఇండియా అని ఒకరు పోటీలు పడి ప్రచారం చేస్తారు. ఇవన్నీ విన్న ఇంకో రాష్ట్రంలోని నాయకుడు నో వే, వీళ్లంతా ఉత్తుత్తి, మాదే అసలుసిసలైన వ్యాపార కేంద్రం కావలిస్తే చూసుకొండి ఇక్కడ ఎందరు వ్యాపారవేత్తలున్నారో అంటాడు. ఇక డబల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ మాటలు సరేసరి.
అరె భై ప్రజలకు ఈ గేట్ వేలు లేవా, వాళ్ల ఓట్లతో పైకొచ్చి పైనున్నవారిని ఏరి ఏరి రమ్మంటున్నారు, ఉచితంగా భూములు, ఇంకా అనేక సౌకర్యాలు ఇస్తున్నారు అనడిగితే ఇదంతా చేసేది వాళ్లకోసమే కదా అన్న సమాధానం అందరూ చెబుతారు. నా ప్రజలే నా ప్రాణమంటారు. ఆ ప్రజలు అన్న పదానికి నిర్వచనం ముఖ్యం. ప్రభువులైనోళ్ళు తమ దృష్టిలో వ్యాపార ప్రజలే అసలైనోళ్లని, వాళ్లు లేకుంటే మాకు ఊపిరికూడా ఆడదని నిత్యం ప్రదక్షిణలు చేస్తుంటారు వారి చుట్టూ. మేము వీళ్లని ప్రార్ధించినా మామూలు ప్రజలకు మంచి జరగాలనే మా తాపత్రయం అనడం అతి సహజం.
అసలు ప్రజలకిచ్చేవేమిటో మా ఎన్నికల వాగ్దానాల లిస్టులో చూడండి కావలిస్తే అంటారే కాని వాటి అమలు గురించి చెప్పండి అంటే మా రోడ్ మ్యాప్ మాకుందని తప్పించుకుంటారు. ఇక చివరగా అందరూ రజనీకాంత్ డైలాగ్ లాగ మా దారి రహదారి అని చెప్పేటోళ్లే. ఆ దారి ఎవరికి అన్న ప్రశ్న ముఖ్యం. అది ప్రజలకోసం వేసే రహదారైతే మంచిదే. పెద్దోళ్లకు అన్నీ ఉచితంగా ఇచ్చి తరువాత ప్రజలకు పన్నులు పెంచి, ఆపై తగ్గించి బచత్ అంటే అది సరైన మార్గం కాదు. ఈ సడక్ యోజనలు సామాన్యులకు కావాలి. సామాన్య ప్రజలు ప్రభుత్వాసుపత్రికి రావాలంటే కొండలు ఎక్కి దిగి వస్తున్నారు చాలాచోట్ల. వారికి సడక్‌లు వేయండి మొదట. వాళ్ల బతుకులు బచత్ చేయండి. తరువాత ఎన్ని రోడ్లు, మార్గ్‌లు, వేసినా మంచిదే.
జంధ్యాల రఘుబాబు
9849753298


