స్వయంగా రంగంలోకి సీఎం
మొదట అన్ని విభాగాలు కలిపి
ఆ తర్వాత శాఖల వారీగా సమీక్షలు
రెండేండ్ల పాలన, పురోగతిపై సమాలోచనలు
రాబోయే మూడేండ్లకు ప్రణాళికలు
24 నుంచి భేటీలు షురూ
-బి.వి.యన్.పద్మరాజు
ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం.. మరోవైపు రెండేండ్ల పాలనను జయప్రదంగా ముగించటం.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో మరింత దూకుడును ప్రదర్శించబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కొనసాగించిన పాలన, దాని పురోగతి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అమలు చేసిన కార్యక్రమాలపై లోతైన సమీక్ష చేయాలని నిర్ణయించారు. తద్వారా రాబోయే మూడేండ్ల కాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, కొత్త స్కీములు, ప్రోగ్రాములపై భారీ కసరత్తులు చేయనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24న అన్ని శాఖలు, విభాగాలపై ఓవరాల్‌గా ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 25 నుంచి రోజుకు కొన్ని శాఖల చొప్పున రివ్యూలు చేపట్టనున్నారు. ఈనెలాఖరకు కొనసాగే ఈ సమీక్షలకు సంబంధిత శాఖా మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు విధిగా హాజరు కావాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ నుంచి ఆర్డర్ వెలువడింది. ప్రతీ డిపార్టుమెంటు విధిగా పూర్తి సమాచారాన్ని గణాంకాలతో సహా తీసుకుని రావాలంటూ అందులో పేర్కొన్నారు. డిపార్టుమెంట్ల వారీగా ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు, రెండేండ్ల నుంచి వాటిలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను రిపోర్టులో పొందుపరచాలని సీఎస్ రామకృష్ణారావు.. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. గత ప్రభుత్వ పరిపాలతో పోల్చి స్కీముల వారీగా రిపోర్టును సమర్పించాలని ఆయన సూచించారు. దీంతోపాటు డిపార్టుమెంట్లు, విభాగాల వారీగా ఆదాయ వ్యయాలు, ఏయే పథకాలకు ఎంతెంత నిధులను కేటాయించారు? వాటిలో ఎన్ని డబ్బులు విడుదలయ్యాయి? ఫలితంగా ప్రజలకు అందిన సౌకర్యాలు, సేవలను పేర్కొనాల్సి ఉంటుంది. శాఖల వారీగా సాధించిన విజయాలు, ఆవిష్కరణలు, లబ్దిదారుల అభిప్రాయాలు, ఆ క్రమంలో గమనించిన అంశాలను కూడా సీఎంకు సోదాహరణంగా వివరించాలని సీఎస్ సూచించారు.
వివిధ డిపార్టుమెంట్లకు ఉన్న ఆదాయ వనరులు, వాటిని సమకూర్చుకోవటంలో సాధించిన లక్ష్యాలు, విభాగాల్లోని సిబ్బంది సంఖ్య, ఖాళీ పోస్టులు, అధికారులు, సిబ్బందికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సమస్యలు, నైపుణ్యాలు, వాటిని మెరుగుపరుచుకోవటానికి శిక్షణా కార్యాక్రమాలు తదితరాంశాలను కూడా సీఎం అడుగుతారని, అందుకనుగుణంగా సిద్ధమై రావాలని సీఎస్ ఆదేశించారు. పథకాల అమల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, సమన్వయ లోపాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, అక్కడి నుంచి రావాల్సిన నిధులు, అది సృష్టిస్తున్న ప్రతిబంధకాలపై కూడా ఉన్నతాధికారులు సీఎంకు వివరించాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలన్నింటినీ ఒక నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు వీలుగా సూచనలు, సలహాలతో రిపోర్టును సమగ్రంగా రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. ఇలాంటి అంశాలన్నింటినీ తర్వాతి నెలల్లో నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశాల్లో ప్రతిపాదించటం ద్వారా సీఎం వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
గ్లోబల్ సమ్మిట్ -2047కు ప్రణాళికలు…
మరోవైపు డిసెంబరు 8,9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించబోయే ‘గ్లోబల్ సమ్మిట్-2047’కు నిర్మాణాత్మక సూచనలు, సలహాలను ఇవ్వాలంటూ సీఎస్… ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణ ప్రగతిని ప్రతిబింబించే విధంగా సమ్మిట్‌లో ఏర్పాటు చేయబోయే స్టాళ్లు, ప్రదర్శనలు, లఘు చిత్రాలు, ఆడియో విజువల్స్, డాక్యుమెంటరీలు, ఇన్ఫోగ్రాఫ్స్‌ను తక్షణమే రూపొందించాలని ఆదేశించారు. వివిధ రంగాల నిపుణులు, సామాజికవేత్తలు, మేధావులతో సదస్సులు, సెమినార్లు, రౌండ్‌టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమలు, విద్యారంగం, స్టార్టప్స్, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు, సంఘాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అవగాహనలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సీఎస్ తన ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం ఐటీ శాఖ సహకారం తీసుకోవాలని కోరారు.


