Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి ప్రభుత్వం అనుమతి

గనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి ప్రభుత్వం అనుమతి

- Advertisement -

”సింగరేణి గ్లోబల్‌” పేరుతో అంతర్జాతీయ కీలక ఖనిజాన్వేషణ రంగంలోకి..
సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమానికే ప్రాధాన్యం
కర్నాటకలో బంగారం, రాగి ఖనిజాన్వేషణ : సెక్రటేరియట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఏ ప్రాంతంలో అయినా బొగ్గు సహా ఇతర కీలక ఖనిజాలకు సంబంధించి నిర్వహించే అన్ని వేలంపాటల్లో సింగరేణి సంస్థ తప్పకుండా పాల్గొంటుందనీ, దానికి సంబంధించిన పూర్తి అనుమతుల్ని జారీ చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సింగరేణి భవిష్యత్‌పై ఆయన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ (పీపీటీ) ద్వారా వివరాలు వెల్లడించారు. వేలంపాటల్లో బొగ్గు బ్లాకులు సాధించుకోలేకపోతే సింగరేణికి గడ్డుకాలం తప్పదనీ, దీనివల్ల సంస్థలో పనిచేస్తున్న 40వేల మంది కార్మికులు, 30వేల మంది పొరుగుసేవల సిబ్బంది కుటుంబాలకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. అందువల్లే సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశవ్యాప్త బహిరంగవేలంపాటల్లో పాల్గొనేలా అనుమతులు ఇచ్చామన్నారు.

అలాగే ‘సింగరేణి గ్లోబల్‌’ పేరుతో అంతర్జాతీయంగా కీలక ఖనిజాన్వేషణ రంగంలోకి ప్రవేశం కల్పిస్తున్నామనీ, దానిలో భాగంగానే కేంద్రం కర్నాటకలో నిర్వహించిన బహిరంగవేలంలో పాల్గొని, అక్కడి బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్సుల్ని దక్కించుకున్నదని తెలిపారు. గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికే సొంతమై ఉండేవనీ, కానీ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు కేటాయిస్తున్నదని వివరించారు. పలు రకాల భ్రమలు, అపోహలు, భావోద్వేగాల కారణంగా సింగరేణిని ఆ వేలంపాటల్లో పాల్గొనకుండా మాజీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. దానివల్ల సింగరేణి గనుల పక్కనే ఉన్న రెండు పెద్ద బ్లాకులు సత్తుపల్లి, కోయగూడెం ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయనీ, ఫలితంగా ఆ సంస్థకు రూ. 60 వేల కోట్ల రెవెన్యూ, రూ.15 వేల కోట్ల లాభాలను కోల్పోయిందన్నారు. ఇది చాలా ఘోర తప్పిదమని విమర్శించారు.

వేలంలో సింగరేణి పాల్గొనకపోతే అది ప్రయివేటు వ్యక్తులకు లాభం చేకూర్చుతుందనీ, అప్పుడు కూడా రాష్ట్రానికి రాయల్టీ వస్తుందే తప్ప, సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే బహిరంగ వేలంలో సింగరేణి పాల్గొంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో లాభం వస్తుందనీ, పన్నుల రూపంలో మరింత ఆదాయం లభిస్తుందని వివరించారు. సింగరేణిలో ప్రస్తుతం 38 గనులు ఉన్నాయనీ, వాటిలో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయనీ, మరో ఐదేండ్లలో పది గనులు మూతపడనున్నాయని చెప్పారు. ఫలితంగా సంస్థలో 8వేల మంది ఉద్యోగులు అవసరానికి మించి ఉంటారనీ, వారి ఉద్యోగ భద్రత కోసం కొత్త గనులు అవసరమనీ తెలిపారు.

సింగరేణి గ్లోబల్‌…
‘సింగరేణి గ్లోబల్‌” పేరుతో అంతర్జాతీయంగా కీలక ఖనిజాన్వేషణ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే థర్మల్‌, సోలార్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లోకి కూడా ఆ సంస్థ ప్రవేశి స్తుందని చెప్పారు. సింగరేణి గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పేరుతో సోలార్‌, పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటులో భాగస్వామి అవుతుందనీ, దీనికోసం కన్సల్టెన్సీ నియామకం పూర్తయ్యిందని వివరించారు.

కర్నాటకలో బంగారం, రాగి అన్వేషణ
సింగరేణి వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇటీవల జరిగిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో కర్నాటక రాష్ట్రంలోని రాయచూరులోని దేవదుర్గ్‌ ప్రాంతంలో బంగారం, రాగి అన్వేషణకు 37.75 శాతం రాయల్టీతో లైసెన్సు సాధించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. త్వరలో ఈ అన్వేషణ పనులు ప్రారంభి స్తామన్నారు. అన్వేషణ అనంతరం ఆ ప్రాంతంలో ఎవరు ఆ గనులను చేపట్టినా, గనుల పూర్తి కాలం వరకు 37.75 రాయల్టీని సింగరేణికి చెల్లిస్తూ ఉంటారని వివరించారు. ఈ పీపీటీ కార్యక్రమంలో సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ బలరామ్‌, సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్‌ (ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) కే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -