ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
ప్రయివేటు కళాశాలల్లో
68.25 శాతం మంది
ప్రభుత్వ కాలేజీల్లో
31.75 శాతం మాత్రమే
గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ మిగులుతున్న సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వరంగంలోని జూనియర్ కాలేజీల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇదే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉండడం గమనార్హం. 2024-25 విద్యాసంవత్సరంలో మొత్తం 9,97,013 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. వారిలో ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో 6,80,505 (68.25 శాతం) మంది చదివారు. ప్రభుత్వరంగంలోని జూనియర్ కాలేజీల్లో 3,16,508 (31.75 శాతం) మంది మాత్రమే చదివినట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వ కాలేజీలు విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. అందులోనూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కేజీ టు పీజీ ఉచిత విద్యాపథకంలో భాగంగా గురుకులాలను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో 268 ఉన్న గురుకులాల సంఖ్యను 1023కి పెంచింది. అయితే వాటిలో 662 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల సమస్యతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అందుకే గురుకుల జూనియర్ కాలేజీల్లోనూ మొత్తం సీట్లు నిండడం లేదు. గతంలో గురుకులాల్లో సీట్ల కోసం మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖల నుంచి ఇప్పుడు సీట్లు మిగులుతుండడం గమనార్హం.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థుల విముఖత
రాష్ట్రంలో 429 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వాటిలో కేవలం 1,42,261 (14.27 శాతం) మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 5,300 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన 27 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ ఉన్నారు. ఇటీవలే 1,282 మంది నూతన అధ్యాపకులను నియమించింది. గతంలో సుమారు 3,200 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించింది. గత విద్యాసంవత్సరంలో నాలుగు వేల మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేశారు. 1,654 మంది అతిథి అధ్యాపకులు కూడా విధులు నిర్వహించారు. అయితే గత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో 68,100 మంది, ద్వితీయ సంవత్సరంలో 74,161 మంది చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిని చూపడం లేదు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపులున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఎప్‌సెట్, నీట్, జేఈఈ వంటి కోచింగ్‌లను ఇవ్వడం లేదు. విద్యార్థులకు కేవలం ఇంటర్ పాఠాలు మాత్రమే చెప్తారు.
అయితే తల్లిదండ్రులు ఇంటర్ మాత్రమే కాకుండా నీట్, జేఈఈ, ఎప్‌సెట్ కోచింగ్ ఉన్న కాలేజీల్లో చేర్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకోవైపు మధ్యాహ్న భోజన పథకం పదో తరగతి వరకే అమలవుతున్నది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని అధ్యాపక, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఒక కారణంగా ఉందని విద్యావేత్తలు చెప్తున్నారు. అయితే పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. ఉదాహరణకు మారెడ్‌పల్లి జూనియర్ కాలేజీల్లో మొత్తం సీట్లు భర్తీ అవుతున్నాయి. మండలాల్లో ప్రాంతాల్లోని జూనియర్ కాలేజీల్లో ఎక్కువ మంది చేరడానికి ఆసక్తి చూపడం లేదు.
కేజీబీవీ, మోడల్ స్కూళ్లదీ అదే పరిస్థితి
రాష్ట్రంలోని 495 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఉన్నాయి. వాటిలో 283 కేజీబీవీల్లో ఇంటర్ వరకు, మిగిలిన 250 కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్యార్థినిలు చదువుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో మరో 120 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో 403 కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యనందిస్తాయి. 283 కేజీబీవీల్లో 26,690 మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో చదివారు. ఒక్కో కేజీబీవీలో సుమారు ప్రథమ సంవత్సరంలో 320 సీట్లుంటాయి. కానీ ఒక్కో కేజీబీవీలో 94 మంది విద్యార్థినిలు చదువుతుండడం గమనార్హం. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లున్నాయి. వాటిలో ఇంటర్ వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి. గత విద్యాసంవత్సరంలో వాటిలో 36,805 చదివారు. ఒక్కో మోడల్ స్కూల్‌లో 320 సీట్లుంటాయి. ఈ లెక్కన 194 మోడల్ స్కూళ్లలో 62,080 సీట్లు అందుబాటులో ఉంటాయి. గత విద్యాసంవత్సరంలో 25,275 సీట్లు మిగిలాయి.
సర్కారు కాలేజీలు వెలవెల…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES