Monday, April 13, 2026
E-PAPER
Homeజాతీయంసర్కారీ ధోకా!

సర్కారీ ధోకా!

- Advertisement -

నిరుద్యోగ యువతతో కేంద్రం ఆటలు
పోటీపరీక్షల పేరుతో కోట్లు వసూలు
లీకులు, రద్దులు, ఆలస్యాలతో కాలహరణం
సక్సెస్‌ రేటు 0.3 శాతమే..
పోటీపరీక్షల సన్నద్ధతే జీవనవిధానంగా మార్చుకుంటూ వయోపరిమితి కోల్పోతున్న యువతరం
కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు


నవతెలంగాణ-సెంట్రల్‌డెస్క్‌
నిరుద్యోగ యువతతో కేంద్రం ఆటలాడుతోంది. సర్కారీ కొలువు అనే ఆశను ఎరగా వేసి, పోటీ పరీక్షల ఫీజుల రూపంలో కోట్లరూపాయలు దండుకుంటోంది. ఆ పరీక్షల్ని కూడా సకాలంలో నిర్వహించట్లేదు. పేపర్‌ లీకేజీలు, ఆలస్యాలు, వాయిదాలతో కాలహరణం చేస్తుంది. ఎలాగైనా సర్కారీ కొలువు సాధించాలనే పట్టుదలతో పోటీపరీక్షల సన్నద్ధతే జీవనవిధానంగా మార్చుకుంటున్న యువతరం వయోపరిమితి కోల్పోతుంది. ఆ తర్వాత జీవితంలో ఎలాంటి పురోగతి లేకుండా నిర్వీర్యం అవుతుంది. దీనికి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పోటీపరీక్షల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఏటా కోట్లాదిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారు. ఉద్యోగభద్రత, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో గౌరవం వంటి ఆశలు వారిని ఈ మార్గంలో నడిపిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీపరీక్షల్లో సక్సెస్‌ రేటు కేవలం 0.3 శాతమే. మిగిలిన పోటీపరీక్షలన్నీ పేపర్‌ లీక్‌లు, వాయిదాల ఫలితంగా పరీక్షార్ధుల వయోపరిమితి దాటిపోతుంది.

సొంతూళ్లను వదిలి…
ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే తపనతో యువతరం తమ సొంతూళ్లను వదిలి పట్టణాలకు వలసబాట పడుతోంది. లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ సెంటర్లు, స్టడీహాళ్ల చుట్టూ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఇలా ఏటా కోట్లాది మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారు. కానీ వ్యవస్థ మాత్రం వారి కృషిని వెక్కిరిస్తోంది. అభ్యర్థులు చాలా కష్టపడి చదువుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణ సమయంలో పేపర్‌ లీకులు, ఆలస్యాలు, వాయిదాలు, రద్దులు, సాంకేతిక సమస్యలు వంటివి సర్వసాధారణంగా మారి, ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి.

పోటీ పరీక్షలే జీవనవిధానం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువైన విషయం కాదు. దేశంలో లక్షలాది మంది యువత ప్రభుత్వ పరీక్షల కోసం సన్నద్ధమవడాన్ని జీవనవిధానంగా మార్చుకుంటున్నారు. చిన్నచిన్న గదుల్లో సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతూ, మాక్‌ టెస్టులు రాస్తూ సర్కారీ కొలువే లక్ష్యంగా పోటీపడుతున్నారు. కేవలం ఒకే పోటీ పరీక్షపై ఆధారపడట్లేదు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే, బ్యాంకింగ్‌, యూపీఎస్సీ వంటి అనేక పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

15 రాష్ట్రాల్లో 70 పరీక్షల పేపర్‌ లీకులు
పోటీ పరీక్షల్లో పేపర్‌ లీకులు, పరీక్షల రద్దు వంటివి సర్వసాధారణంగా మారాయి 2017 నుంచి 2024 వరకు 15 రాష్ట్రాల్లో 70 పోటీ పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయి. వీటివల్ల దాదాపు 1.7 కోట్ల మంది అభ్యర్థులు ప్రభావితం అయ్యారు. 2024 లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన 14 ప్రధాన పరీక్షల్లో ఐదు పరీక్షలు లీకులు, ఆలస్యాలు, సాంకేతిక సమస్యలతో వాయిదా పడుతూ వస్తున్నాయి.

జీవితాలపై ప్రభావం
పరీక్షలు రద్దయినప్పుడు అభ్యర్థులు పోటీ పరీక్షలకు మళ్లీ మొదటి నుంచి సిద్ధమవ్వాల్సి వస్తుంది. ఇది వారి విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. ఈ ప్రభావం కేవలం విద్యపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఏండ్ల తరబడి కోచింగ్‌ ఫీజులు, హాస్టళ్లు, స్టడీహాళ్లు, జీవన ఖర్చులు పెరిగి, యువతరం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురువుతున్నది.

22 కోట్ల దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏటా కోట్లలో దరఖాస్తులు వస్తున్నాయి. కానీ ఉద్యోగాలు పొందేవారి సంఖ్య అతిస్వల్పం. 2014 నుంచి 2022 వరకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 22 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో సక్సెస్‌ రేటు కేవలం 0.3 శాతమే. గణాంకాలు ఇలాంటి చేదు వాస్తవాలను వెల్లడిస్తున్నా, యువతలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలపై క్రేజ్‌ తగ్గడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్‌ రంగాల్లో ‘లే ఆఫ్‌’లు యువతరాన్ని పునరాలోచనలోకి నెడుతున్నాయి.

ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా అన్ని విధాల భద్రత ఉంటుందనే విశ్వాసం పెరుగుతోంది. దీన్ని ఆసరా చేసుకొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటీపరీక్షల పేరుతో కోట్ల రూపాయల ఫీజుల్ని వసూలు చేసుకుంటూ, సకాలంలో పరీక్షలు నిర్వహించకుండా అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. చదువు పూర్తయ్యాక ఒక్కో విద్యార్థి కనీసం మూడు నుంచి ఆరేండ్లపాటు పోటీపరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరు అభ్యర్థులు 40 ఏండ్లు దాటినా పోటీపరీక్షలే లక్ష్యంగా చదువుల్ని కొనసాగిస్తుండటం విశేషం.

సర్కారీ కొలువే ఎందుకు?
ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలంటే ఎన్ని కష్టాలుంటాయో యువతకు తెలియంది కాదు. ప్రభుత్వ ఉద్యోగం సమాజంలో ఇప్పటికీ గౌరవానికి చిహ్నంగా భావించబడుతోంది. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ ఉద్యోగంతో కుటుంబ గౌరవంతో పాటు సమాజంలో మర్యాద లభిస్తుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశిస్తూ, చిన్నప్పటి నుంచే ఈ దిశగానే ప్రోత్సహిస్తుంటారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘లే ఆఫ్స్‌’ వంటి సమస్య ఉండదు. స్థిరమైన జీతం, పెరుగుదల, పెన్షన్‌ వంటి ప్రయోజనాలు ఉంటాయి. నిర్దిష్ట పని గంటలు ఉండటంతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రయివేటు ఉద్యోగాల్లో వచ్చిన అనిశ్చితి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలపై యువతరం మరింత విశ్వాసాన్ని పెంచుకుంటోంది. దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలతో నట్టేట ముంచుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -