అక్కడ భవనాలున్నాయి. తరగతి గదులు ఉన్నాయి. వసతులూ ఉన్నాయి. బోధించడానికి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. లేనిదల్లా ఒక్క విద్యార్థులు మాత్రమే. అవి ప్రభుత్వ పాఠశాలలు. అలాంటివి ఈ దేశంలో ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఒకనాడు చదువంటే ప్రభుత్వ విద్య. పాఠశాల అంటే సర్కారు బడి. అతికొద్ది మిషనరీ స్కూళ్లు మాత్రమే సేవా భావంతో పేద ప్రజలకు విద్యను అందించేవి. నాడు చదువుకునే వారికి ప్రభుత్వ బడులు మాత్రమే తెలుసు. మరి, నేడు ఎందుకు ఈ దుస్థితి దాపురించింది? దేశంలో 10.13 లక్షల పాఠశాలలు ప్రభుత్వ రంగంలో నడుస్తున్నాయి. గతంలో అవి ఇంకా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడవి క్రమంగా తగ్గుతూ నేడు ఈ సంఖ్యకు, ఈ స్థితికి చేరుకున్నాయి. దేశంలో కోటి మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కానీ, విద్యా ప్రమాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడు కుంటే అంత మంచిది. దేశవ్యాప్తంగా నేడు ఎనిమిది వేల బడుల్లో ఒక్క విద్యార్థి కూడా విద్యను అభ్యసించడం లేదు. అంటే జీరో ఎన్రోల్మెంట్. కానీ ఇలాంటి బడులలో 20187 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు యుడైస్ నివేదిక స్పష్టం చేస్తున్నది.
ఇది ఎలా సాధ్యం? టీచర్లు లేని బడులు ఊహించుకోగలం. కానీ, విద్యార్థులు లేని పాఠశాలలు, వాటిలో ఇన్ని వేల మంది ఉపాధ్యాయులు పనిచేయడం అంతు పట్టని విషయం. ఒకప్పుడు బడులు నెలకొల్పినా వాటిలో టీచర్లు ఉండేవారు కాదు. కానీ నేడు టీచర్లు ఉన్నారు. చదువుకునే విద్యార్థులే కరువయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 3812 ప్రభుత్వ బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదు కాగా వాటిలో 17965 మంది ఉపాధ్యాయులు పనిచేయడం హాస్యాస్పదం. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో 315 ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం దేన్ని సూచిస్తుంది? అధికారుల అలసత్వమా, ఉపాధ్యాయుల అనాసక్తతా, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పా అనేది వెంటనే విద్యాశాఖ సమీక్షించాల్సిన విషయమిది. ప్రభుత్వ బడుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా ప్రయివేటు పాఠశాలల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడిందనేది నిర్వివాదాంశం.
దేశంలో 25 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. డ్రాపౌట్ల సంఖ్య అత్యధికంగా మణిపూర్ రాష్ట్రంలో ఉండగా, కేరళలో అత్యల్పంగా ఉండడం గమనార్హం. లక్ష ఏకోపాధ్యాయపాఠశాలలు నడుస్తుండగా వాటిలో 33 లక్షల మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. రానురానూ నమోదు తక్కువ కావడం బాధాకరం. డ్రాపౌట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కోటి మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నా ప్రమాణాలు మాత్రం పెరగకపోవడం శోచనీయం. బడ్జెట్ కేటాయింపులలోనూ ప్రభుత్వాలు పిసినారితనమే ప్రదర్శిస్తున్నాయి. జీడీపీలో కనీసం మూడు శాతం నిధులు కూడా కేటాయించలేకపోతున్నాయి. ఫలితంగా పథకాలు, ‘ప్రాధమ్యాలు’ కాగితంపై ఘనంగా కనబడుతున్నా చివరికి చేరుకుంటున్న లక్ష్యలు అట్టడుగున దర్శనమిస్తున్నాయి. ఆలోచనలకు, అమలుకు, ఆకాశానికి అధ: పాతాళానికి ఉన్న తేడా కనిపిస్తోంది. అంటే కేవలం చిత్తశుద్ధి లేకపోవడం అనేది సుస్పష్టం.
ఒకపక్క కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. దాని పర్యవసానంగా దేశంలోని వైద్య న్యాయ విద్య మినహా మిగిలిన ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆ చట్టం పరిధిలో పనిచేస్తాయి. ఇప్పటికే చరిత్రను వక్రీకరిస్తూ రకరకాల చారిత్రక అంశాలను మార్చుతూ విద్యను కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది కేంద్రం. దీంతో దశాబ్దాల క్రితం ఏర్పడిన రాజ్యాంగ సంస్థలు యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సీటిఈ లాంటి సంస్థలు రద్దవుతాయి. విద్య ప్రయివేటీకరణకు మార్గం సుగమమవుతుంది. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి ఈ బిల్లు అడ్డుపడుతుంది. ఇదంతా చూస్తే విద్యపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా కనిపిస్తున్నది! ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నానాటికి తీసికట్టుగా సాగుతున్నది 2024- 25 సంవత్సరంలో 2245 బడులలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు విద్యాశాఖ వారు చెప్పే కుంటిసాకులు ఆశ్చర్యం కలిగిస్తాయి విద్యార్థులు క్రమంగా గురుకులాల్లోనూ ప్రయివేటు పాఠశాలలకు ఆకర్షితులవుతున్నారనేది వారి వాదన. ప్రయివేటు రంగంలోని పాఠశాలల్లో ప్రతి సంవత్సరము విద్యార్థుల నమోదు పెరుగుతూ ఉన్నది. నిజమే గురుకులాల్లో గత రెండేళ్లుగా అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి.
ఒక దశాబ్ద కాలం వైభవంగా నడిచిన గురుకులాలు నేడు కునారిల్లుతున్నాయి. ఆరువందల గురుకులాలకు సొంతభవనాలు లేవు అద్దె భవనాలకు చెల్లించవలసిన బకాయిలు పేరుకుపోయి యజమానులు వాటికి తాళాలు వేసుకుంటున్న పరిస్థితినెలకొంది. రకరకాల కారణాలతో వందకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కలుషిత ఆహారం, పాముకాట్లు, ఎలుకల కాట్లు ఇవన్నీ గురుకుల వ్యవస్థను అప్రతిష్టపాలు చేశాయి. ఇది కూడా కావాలనే జరుగుతున్న పరిణామాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తున్నది. ఒక్కొక్క క్యాంపస్ నందు నాలుగు లేదా ఐదు గురుకులాలు వివిధ యాజమాన్యాల కింద నడుస్తాయి. ఒక్కొక్క కాంప్లెక్స్‌లో 2500 మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటారు. ప్రతి క్యాంపస్ కొరకు రూ.200 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల కాంప్లెక్స్ నిర్మిస్తారు. అంటే 117 నియోజకవర్గాలకు రూ.200 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయిస్తారు.
ఇంత కాలంగా సొంత భవనాల్లో నడుస్తున్న 400 పైగా గురుకుల భవనాలు క్వార్టర్స్ ఏమవుతాయి? ఆరువందల గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చితే సరిపోయేదానికి వేల కోట్ల రూపాయల ఖర్చు సబబేనా? దిగజారుతున్న ఆర్థిక స్థితిలో ఇది సాధ్యమేనా అన్నది విద్యాభిమానుల ప్రశ్న. ఈ బడ్జెట్లో పదోవంతు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించినా వాటికి పునరుజ్జీవం కలిగించ వచ్చు. మరోపక్క దేశంలోనే మూతబడుతున్న పాఠశాలల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. విద్యార్థులు టీచర్లు లేని పాఠశాలలు 1441 ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 2245 జీరో ఎన్రోల్మెంట్ బడులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆరువందల బడులల్లో టీచర్ల పోస్టులు ఉన్నాయి, పిల్లలే లేరు. మూడు వేలకు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా మూత పడడానికి సిద్ధంగాఉన్నాయి. మొత్తంగా ఐదు వేల పాఠశాలలు కనుమరుగు కాబోతున్నాయి. ప్రతియేటా లక్షకు పైగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోతుండడం గమనార్హం. అన్ని రకాల శిక్షణ, విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులు పనిచేసే ప్రభుత్వ బడులు క్రమంగా నిర్వీర్యమై విద్యార్థులకు దూరమవుతున్నాయి.
విద్యాహక్కు చట్టం నిస్సహాయం కాబోతున్నది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధంగా అందించాల్సిన ఉచిత విద్య ఇక కాగితాలకే పరిమితం కాబోతున్నది. ఏనాడైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే వరంగా నడుస్తూ వచ్చాయి. కానీ అవే నేడు వారికి దూరం అవుతున్న నేపథ్యంలో వారికి ప్రయివేటు బడులే తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వ రంగంలోని బడులలో నాణ్యత, మౌలిక వసతులు, భవనాలు, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం, నేటి తరానికి అవసరమైన కంప్యూటర్ సౌకర్యాలు లోపించడంతో తల్లిదండ్రులు, వారి పిల్లలు ప్రయివేటుకే మొగ్గు చూపుతున్నారు. ఇంకా 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షణ అధికారులు లేరు. పదోన్నతులు లేక అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంతసేపు ‘పెద్దపెద్ద కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం, ఇక అద్భుతాలే’ అన్న ప్రకటనలే కానీ క్షేత్రస్థాయిలో అంతా శూన్యం.
పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులు ఫారాలు నింపడానికి, శిక్షణకు తమ శక్తులు ధారపోస్తున్నారు. ఇవి చాలనట్లు వేలాదిమందిని ఇతర పాఠశాలల్లో బోధన పరీక్షంచి పరిశీలించి సలహాలకు సూచనలకు వినియోగించుకుంటున్నారు. అయినా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెరగాలని అడ్మిషన్లు పెరగాలని కోరుకోవడం అత్యాశ కాదా? ఐదవ తరగతి విద్యార్థి రెండో తరగతి స్థాయిలో నైపుణ్యాలు సంపాదించడం బాధాకరం. ప్రభుత్వ విద్య నిర్వీర్యమవుతున్నది. ప్రభుత్వమే పరోక్షంగా ప్రయివేటు విద్యకు పట్టం కడుతున్నది. ప్రోత్సహిస్తున్నది ధనవంతులు. వారి విద్యార్థుల సంగతి ఎలాగున్నా సబ్బండ వర్గాలకు ప్రభుత్వ విద్య మరింత దూరమవుతున్నది. కొంత కాలానికి ప్రభుత్వ విద్య మాయమవుతుందన్న ఆందోళన విద్యాభిమానుల్లో ఉంది. ప్రయివేటు విద్యాలయాలను నియంత్రించగల శక్తి సామర్థ్యాలు సదుద్దేశాలు ప్రభుత్వాలకు లేవని ఈ ఐదారు దశాబ్దాలలో నిరూపణ అయింది. కనీసం ప్రభుత్వ పాఠశాలలకౖౖెనా కొంతమేరకు ప్రాణప్రతిష్ట చేస్తే ప్రజల్లో వాటిపైన విశ్వాసం కలిగి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
శ్రీశ్రీ కుమార్
9440354092



