Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిసర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగుల సమరభేరి

సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగుల సమరభేరి

- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్‌ 1నుంచి దశల వారి పోరా టానికి సిద్ధమయ్యారు. ఇంతకాలం ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరిస్తుందని భావించినప్పటికీ పాలకుల స్పందన అంతంత మాత్రమే ఉంది. పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఇదిగో,అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. దీంతో ఉద్యమాల ద్వారానే సర్కార్‌పై ఒత్తిడి తేవాలని ఉద్యోగులంతా ముందుకు కదులుతున్నారు. కొత్త పెన్షన్‌ వద్దని, పాత పెన్షన్‌నే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిన్న హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించారు. దీనికి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరై తమ నిరసన తెలిపారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చింది. అయితే వాటిని నెరవేర్చేందుకు మాత్రం వెనుకాడుతున్నది. ప్రధానంగా ఉద్యోగులను, పెన్షనర్లకు రావాల్సిన డిఏలను, పీఆర్సీని అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ప్రకటిస్తామని చెప్పింది. మరి సర్కారు కొలువుదీరి ఇరవై నెలలు అవుతోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ సాచివేత ధోరణినే ప్రదర్శిస్తున్నది. అతి కష్టంగా రెండు డిఏలు ప్రకటించింది, ఇంకా 5 డిఏలు ప్రకటించవలసి ఉన్నది. పిఆర్సీ గురించి పలుకే లేదు. దేశంలోనే అత్యధిక డిఏలు బాకీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యోగులు ఇంత కాలంగా దాచుకున్న ప్రావిడెంట్‌ సొమ్మునూ అందివ్వడం లేదు. తమ ఆరోగ్య బాగుకై ఖర్చు చేసిన మెడికల్‌ బిల్లులు విడుదల కూడా కొన్నేండ్లుగా ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉండటం దారుణం.
హెల్త్‌కార్డులిచ్చే విషయంలోనూ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చినా చర్యలు మాత్రం శూన్యం. 2023లోనే హెల్త్‌కార్డు పథకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డా యనేది గమనార్హం. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వానికి మనసు ఒప్పడం లేదేమో! అన్నింటికీ ఒకే జవాబు -‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు’ అని. ఆర్థిక భారం పడని సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నది. పైగా ‘ఉద్యోగుల సమస్యలు ఒకరోజు ముందో వెనకో పరిష్కరిస్తున్నాం కదా! వారు ఎందుకు ఉద్యమబాట పడుతున్నారని’ ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో వ్యాఖ్యానించడం సహేతుకం కాదు. గతంలో ఒకసారి ‘నన్ను కోసినా.. నా దగ్గర చిల్లిగవ్వ కూడా దొరకదు’ అని ప్రకటించడం ఉద్యోగ వర్గాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. ఏ సభలోనైనా మాట్లాడుతూ నిధులు వరదలాగా పారుతాయని ప్రకటించే ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల విషయంలో మొండిచేయి చూపడం శోచనీయం. అనేకసార్లు చర్చలు జరుపుదామని ప్రకటించడమే కానీ జరిపింది లేదు. కేవలం ప్రకటనలతో ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
ఇక 317 జీవో బాధితులున్యాయం గురించి ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ న్యాయం జరగలేదు. వారికి స్థానికత ఆధారంగా పోస్టింగులివ్వాలి. ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఇరవై నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. డిఏ ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, ఉద్యోగుల హక్కు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో సెలవిచ్చింది. అయినా ఉద్యోగులు, పెన్షనర్లు కేవలం తమ కరుణాకటాక్షాల మీదనే బతకాలి అన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరించడం బాధాకరం. ఐదేండ్లకోసారి ప్రకటించే వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులు అమలయ్యే వరకు కనీసం ఇంటెరిమ్‌ రిలీఫ్‌ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఉపాధ్యాయుల బదిలీలపై కూడా చాలా విమర్శలు మూటకట్టుకుంది. వారి స్థానికతను పక్కనపెట్టి ఇష్టమొచ్చిన రీతిలో బదిలీలు జరగడం వారిలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అదేవిధంగా పదోన్నతుల విషయమై కూడా వారు ఒక స్పష్టమైన క్యాలెండర్‌ను కోరుతున్నారు. విద్యాశాఖలో ఉన్న వేలాది ఖాళీలను వెంటనే భర్తీ చేయడం వారి డిమాండ్లలో ముఖ్యమైనది.
ఇక పెన్షనర్ల పరిస్థితయితే మరీ దారుణం. అనారోగ్యం పాలైతే ప్రభుత్వ నుండి పైసా సాయం లేదు. ఖర్చు చేసిన మెడికల్‌ బిల్లులు విడుదల కావడానికి నానాయాతన పడుతున్న పరిస్థితి. మారుతున్న కాలానుగుణంగా అరవై ఏండ్లు దాటిన వారందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 2024 మార్చి నుండి రిటైర్‌ అయిన వారికి గ్రాట్యూటీ డబ్బు రాక వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి ఖర్చులకో, లేదంటే పిల్లల పెండ్లిళ్లకో చేసిన ఆలోచనలన్నీ చెదిరిపోయాయి. మరికొంతమంది ఆర్థిక పరిస్థితి దిగజారి ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. వీరి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకనాడు 398 రూపాయల స్కేల్లో ఉద్యోగంలో చేరి రిటైర్‌ అయిన వారికి నోషనల్‌ బెనిఫిట్‌ కల్పించాలనే చిరకాల డిమాండ్‌ అపరిష్కృతంగానే ఉంది. బకాయిల చెల్లింపు కోసం ఫిబ్రవరి మాసం నుండి నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం అందులో సగం కూడా విడుదల చేయకపోవడం బాధాకరం. మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసిన ఉద్యోగుల సంక్షేమం నేడు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేది వారే. కానీ ప్రభుత్వానికి వారి జీవనం పట్ల చిత్తశుద్ధి లేదని ప్రభుత్వ చర్యల ద్వారా స్పష్టమవుతున్నది.
మంత్రివర్గ ఉప సంఘంతో, ఐఏఎస్‌ అధికారుల కమిటీతోనూ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వాలకి రూపాయి అప్పు పుట్టకపోతే, మరి ఉద్యోగులకు, పెన్షనర్లకు బయట సమాజంలో అప్పు పుట్టడం సాధ్యమేనా? ఉద్యోగుల సేవలు మాత్రమే కావాలి, వారి సంక్షేమం అవసరం లేదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వ ఆలోచన. వారికిచ్చే జీతభత్యాలను ప్రభుత్వాలు భారంగా భావించడం నిజంగా శోచనీయం. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి విసిగిపోయిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు, 206 సంఘాలతో జేఏసీగా ఏర్పడి సమరభేరి మోగిం చారు. 63 డిమాండ్ల సాధనకై వివిధ దశల్లో నిరసనలు, పోరాటాలకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రాజకీయాలకతీతంగా ప్రభుత్వ బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలన్నీ ఐక్యంగా జరిపే ఈ ఉద్యమంలో దాదాపు 15 లక్షలకు పైగా పాల్గొంటారని అంచనా. ఇప్పటికైనా సర్కార్‌ కండ్లు తెరవాలి, వెంటనే ఉద్యోగుల సమస్య లు పరిష్కరించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల క్షేత్రస్థాయి జనాల్లోకి తీసుకెళ్లే ఉద్యోగులే అసంతృప్తికి గురైతే పరిపాలన ఎలా ఉంటుంది? దాని ప్రభావం కచ్చితంగా ప్రభుత్వంపై పడుతుంది.

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad