ఉచితంగా విత్తనాలు పంపిణీ..
రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా వ్యవసాయ అధికారి
నవతెలంగాణ – అచ్చంపేట
నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచడం కోసం వేరుశనగ పంటల సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుంది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్ ( ఎన్. ఎం.ఈ ఓ -వో ఎస్ ) పథకం ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తుంది. జిల్లాలో 20 మండలాల పరిధిలో వివిధ గ్రామాలలో యాసంగి సీజన్ వ్యవసాయం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పత్తి పంట పూర్తి కావడంతో దుక్కులు దున్ని వేరుశనగ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉప్పునుంతల, బలుమూరు, తెలకపల్లి, వంగూర్, అచ్చంపేట, మండలాలలోని వివిధ గ్రామాలలో ఇప్పటికే కొందరు రైతులు వేరుశనగ పంటలు సాగు చేశారు.
బహిరంగ మార్కెట్లో వేరుశనగ విత్తనాలు క్వింటాళ్లు సుమారు రూ 13000/- లకు వ్యాపారులు రైతులకు విక్రయిస్తున్నారు. నూనె గింజల సాగు ప్రోత్సాహం కింద ప్రభుత్వం రైతులకు వేరుశనగ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడంతో కొంత ఊరట లభిస్తుందని రైతులు తెలుపుతున్నారు.
జిల్లాలో 464 గ్రామ పంచాయతీల పరిధిలో 14,600 క్వింటాళ్లు వేరుశెనగ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటివరకు 12,500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లాలో ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో రెండు వేల క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలు వచ్చే అవకాశం ఉంది.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి: యశ్వంత్ రావు : జిల్లా వ్యవసాయ అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా
వేరుశనగల పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉచితంగా వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 12,500 క్వింటాళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత విత్తనాల పంపిణీ కొనసాగుతూనే ఉంది. ఆసక్తిగల రైతులు సద్వినియోగం చేసుకోవాలి.