Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంలడఖ్‌లో ప్రభుత్వ వైఫల్యం : తరిగామి

లడఖ్‌లో ప్రభుత్వ వైఫల్యం : తరిగామి

- Advertisement -

శ్రీనగర్‌ : లడఖ్‌లో పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ (ఎం) నాయకుడు, ఎమ్మెల్యే ఎంవై తరిగామి విమర్శించారు. లడఖ్‌లో జరిగిన పరిణామాలను దురదృష్టకరమైనవిగా ఆయన పేర్కొంటూ ఆంక్షలు, అరెస్టులు వంటి ప్రభుత్వ చర్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. ‘2019 ఆగస్ట్‌ 5వ తేదీన ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకురావడంతో కథ మొదలైంది. లడఖ్‌, జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ఆ చట్టమే కారణం. పునర్వ్యవస్థీకరణ పేరుతో జరిగిన ఆటంకం కారణంగా మా భవిష్యత్తును కలసికట్టుగా నిర్ణయించుకోలేక పోతున్నాము. మా వ్యవహారాలను చక్కదిద్దుకోలేక పోతున్నాము’ అని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ‘భారతదేశ గొప్పదనం ప్రభుత్వంలో కానీ, సైన్యంలో కానీ ఉండదు. అది భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉంటుంది. వేర్వేరు భాషలు, మతాలు, సంస్కృతులు కలిగిన మన సమూహాలు కలిసికట్టుగా జీవించాలని నిర్ణయించుకున్నాయి.

అయితే ప్రభుత్వం రాష్ట్రానికి మాత్రమే కాకుండా యావత్‌ దేశానికీ నష్టం కలిగించింది’ అని తరిగామి చెప్పారు. లడఖ్‌ ప్రజలకు అపారమైన భూ సంపద ఉన్నదని, అయితే తక్కువ జనాభా, పరిమిత వనరులు ఉండడంతో వారు గుర్తింపును కోరుకుంటున్నారని తెలిపారు. లాభాల కోసం కన్నేసిన బడా కార్పొరేట్‌ పెట్టుబడిదారుల నుంచి తమ భూములను కాపాడుకోవాలని వారు భావిస్తున్నారని అన్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు జమ్మూ కాశ్మీర్‌కు శాసనసభను ఇచ్చిందని, అయితే లడఖ్‌కు అలాంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. జమ్ము, కాశ్మీర్‌, లడఖ్‌ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తమ భాగస్వామ్యం ఉండాలని లడఖ్‌ ప్రజలు కోరుకుంటూనే ఉన్నారని తరిగామి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -