సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామ
నవతెలంగాణ – వలిగొండ రూరల్
రాత్రి కురిసిన 13 సెంటీమీటర్ల అకాల వర్షానికి మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అధికారులు తక్షణమే సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. సోమవారం రోజున మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసి కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపోయేలా చేసిందని ఒకవైపు పంట కొయ్యకుండా పొలాల్లో కిందకి ఒరిగి వర్షం కారణంగా దెబ్బతినగ, మరోవైపు పంట కోసి మార్కెట్ లలో అమ్మకానికి పోస్తే ప్రభుత్వం మార్కెట్లను ప్రారంభించకుండా జాప్యం చేయడం వల్ల ఈ అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్దవ్వడంతో పాటు వరదల్లో కొట్టుకుపోయిందని తెలిపారు. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులందరినీ ఆదుకునేందుకు తక్షణ చర్యలను చేపట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ తహసిల్దార్ అధికారుల చేత పంట నష్టాన్ని అంచనా వేయించి రైతులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి గూడూరు బుచ్చిరెడ్డి, నాయకులు మెట్టు రవీందర్ రెడ్డి,రోండి రాములు,మల్లేష్, రైతులు మెట్టు నర్సిరెడ్డి,రోండి ఐలయ్య, బద్దం శ్రీనివాస్ రెడ్డి, నల్ల మల్లారెడ్డి,మీసాల నరసింహ,సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.