Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహత్మా ఫూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం

మహత్మా ఫూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం

- Advertisement -

ఆయన ఆశయాలను
సాధించడమే నిజమైన నివాళి
బీసీ మహిళా ఉపకోటా కోసం తీవ్రమైన పోరాటం : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ పాలకులకు బీసీలంటే భయం లేకపోవటంతోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ సబ్‌ కోటా పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం జాగతి ఎంత అంకితభావంతో ఉద్యమం చేసిందో బీసీ సబ్‌ కోటా కోసం అంతే అంకితభావంతో పని చేస్తుందని తేల్చిచెప్పారు. మహత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కల్వకుంట్ల కవితతో పాటు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ ఉపకోటా కోసం మహత్మా ఫూలేనే మళ్లీ పుట్టారా అనే స్థాయిలో తమ పోరాటం ఉంటుందన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. బీసీ కోటా కోసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతామని అన్నారు. అధికార బలం ఉందని బీసీ కోటా లేకుండా బిల్లు పాస్‌ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీ కోటా వచ్చే వరకు జాగృతి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద ఏర్పాటు చేయాల్సిన ఫూలే విగ్రహం విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. అసెంబ్లీ లో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని జాగృతి డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే ట్యాంక్‌ బండ్‌ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈనెల 14న అంబేద్కర్‌ జయంతి నాటికైనా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫూలే ఆశయాల సాధన కోసం అహర్నిశలు పని చేయటమే ఆయనకు నిజమైన నివాళి అని కవిత అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన సరే వెన్ను చూపకుండా పోరాడిన త్యాగధనులు పూలే అని చెప్పారు. ఎన్ని అవమా నాలు, కష్టాలు ఎదురైనా నమ్ముకున్న తోవను వదిలి పెట్టని మహానీయుడు పూలే అని కొనియాడారు. ఫూలే అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

ఆర్టిజన్లకు మద్దతు
విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్జిజన్లను రెగ్యులర్‌ చేయాలని కవిత డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం కొత్తగూడెంలో ధర్నా చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేయటం సరికాదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఆర్జిజన్ల జీతాలు రూ.40 వేలకు పెంచిందని, ఇందులో తన వంతు ప్రయత్నం చేశానని ఆమె గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -