Sunday, February 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం

బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం

- Advertisement -

బంగారు బాతును చంపేందుకు కేంద్రం కుట్ర
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తెలంగాణ సర్కిల్‌ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌

నవతెలంగాణ-మెహదీపట్నం
బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల నయా ఆర్థిక విధానాలే కారణమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. బంగారు బాతులాంటి బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను చంపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) తెలంగాణ సర్కిల్‌ మూడో మహాసభను శనివారం యూనియన్‌ అధ్యక్షులు సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని ఆస్మాన్‌మహల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్నదన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని వేలాది మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ పేరుతో తొలగించి సంస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు నష్టాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను మూసివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాన్ని కార్మికులందరూ సమైక్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రత్నకుమార్‌ మాట్లాడుతూ.. 17 ఏండ్ల తర్వాత సంస్థ ఇప్పుడు లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. సంస్థ ఉద్యోగులు నిరంతరం మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీనియర్‌ నాయకులు అశోక్‌బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సంస్థ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ మహేంద్ర కుమార్‌ రావత్‌ మాట్లాడుతూ.. సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి సాంబశివరావు, నాయకులు రామచంద్రుడు, సుశీల్‌ కుమార్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -