Tuesday, November 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుయూనియన్లను బలహీనపర్చేలా ప్రభుత్వాల విధానాలు

యూనియన్లను బలహీనపర్చేలా ప్రభుత్వాల విధానాలు

- Advertisement -

కార్మిక హక్కుల కోసం ఎపిరాక్‌ యూనియన్‌
16 ఏండ్ల చిరస్మరణీయ పోరాటం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

ఎపిరాక్‌ పరిశ్రమ యూనియన్‌ 16వ వార్షికోత్సవం

నవతెలంగాణ – చర్లపల్లి
పర్మినెంట్‌ ఉద్యోగాల తగ్గింపు, స్టైఫెండ్‌ వర్కర్‌ వ్యవస్థ, యూనియన్‌లపై నియంత్రణ, పరిశ్రమల్లో వేగంగా మారుతున్న పరిస్థితులపై కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు సూచించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎపిరాక్‌ పరిశ్రమ యూనియన్‌ 16వ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, కంపెనీ గౌరవాధ్యక్షులు చుక్కరాములు ముందుగా పరిశ్రమ ముందు సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 ఏండ్లుగా కార్మికుల వేతనాలు, సౌకర్యాలు, హక్కుల సాధనలో ముందంజలో ఉండటం యూనియన్‌ శక్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం నిర్వహించడం యూనియన్‌ ఐక్యతకు నిదర్శనమన్నారు.

సీఐటీయూ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఎపిరాక్‌ యూనియన్‌ను అభినందించారు. ప్రస్తుతం పరిశ్రమల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పర్మినెంట్‌ కార్మికులను తగ్గించి ఉత్పత్తిని వేరే మార్గాల్లో నడపాలనే యాజమాన్య ధోరణి పెరుగుతోందని తెలిపారు. జెండర్‌ డైవర్సిటీ పేరుతో మహిళా కార్మికులను నియమిస్తున్నా వారికి భద్రత, రవాణా, ప్రత్యేక సౌకర్యాలపై ప్రభుత్వాలు బాధ్యత వహించకపోవడం ఆందోళనకరమన్నారు. వేతన కార్మికుల స్థానంలో స్టైఫండ్‌ వర్కర్లను నియమించడం, యూనియన్‌లను అడ్డుకోవడం యాజమాన్యాల కొత్త వ్యూహమన్నారు. పాలసీ నిర్ణయాల్లో ద్వైపాక్షిక చర్చలకు ప్రభుత్వం విలువివ్వకపోవడం, అంతర్జాతీయ కార్మిక సంస్థ సూత్రాలను పాటించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు.

2015 తర్వాత ద్వైపాక్షిక చర్చలే జరగలేదని, సమిష్టి బేరసార హక్కులను బలహీనపరిచే ప్రయత్నాలు, బహిరంగంగానే జరుగుతున్నాయని చెప్పారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. జులై 9న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మె కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసిందని గుర్తుచేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ప్రతి పరిశ్రమలో ఎపిరాక్‌ యూనియన్‌ను ఆదర్శంగా తీసుకుని బలమైన యూనియన్‌ అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్మికులు ఐక్యంగా హక్కుల కోసం పోరాడితేనే పరిష్కారం సాధ్యమని, యూనియన్‌ నాయకత్వం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

యూనియన్‌ మరింత ధృఢంగా, ఐక్యంగా ఉండాలి : పాలడుగు భాస్కర్‌
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం యాజమాన్యం లాభాల పేరుతో కార్మికులను కష్టాల్లో నెట్టేస్తోందని విమర్శించారు. ఎపిరాక్‌ యూనియన్‌ 16 ఏండ్లుగా పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగడం సీఐటీయూ విధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. అగ్రిమెంట్లు సాధించినా, సౌకర్యాలు ఉన్నా కార్మికులపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య అన్యాయాలను అడ్డుకోవాలంటే యూనియన్‌ మరింత దృఢంగా, ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కార్మిక హక్కులను బలహీనపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం : ఎస్‌.వీరయ్య
కార్మికుల హక్కులను బలహీనపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య తెలిపారు. అక్టోబర్‌లో విడుదల చేసిన శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగంలోని సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమ గౌరవం వంటి విలువలకు విరుద్ధమన్నారు. కోట్లాది కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే ఈ కీలక విధానాన్ని యూనియన్లతో చర్చించకుండానే అమలు చేయడం అప్రజాస్వామికమన్నారు. కొత్త పాలసీ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికులపై యజమానుల పట్టు మరింత పెంచి, వేతన భద్రత, పని గంటల నియంత్రణ, రక్షణా చర్యలను నిర్వీర్యం చేస్తుందన్నారు.

ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి అప్పగించడమే ఈ విధానం అసలు ఉద్దేశమని చెప్పారు. దేశ నిర్మాణానికి వెన్నెముకైన కార్మిక వర్గాన్ని కార్పొరేట్‌ లాభాల కోసం త్యాగం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్‌ వ్యవస్థాపకులు భాస్కర్‌, బీవీ సత్యనారాయణ, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మణికంఠ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు జె.చంద్రశేఖర్‌, సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు, కోశాధికారి పి.గణేష్‌, ఏపీరాక్‌ పరిశ్రమ యూనియన్‌ ఆఫీస్‌ బేరర్లు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -