Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత

సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత

- Advertisement -

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి : రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ‘సమతా కిచెన్‌’ ప్రారంభం

నవతెలంగాణ-సిటీ బ్యూరో
వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘సమతా కిచెన్‌’ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే కాకుండా, వారిని ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘సమతా కిచెన్‌’ ద్వారా వారికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 404 మంది ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు పత్రాలు అందించినట్టు చెప్పారు.

రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా బతకాలని, వారి కోసం ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌కు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖలో ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించడం మంచి పరిణామమని, భవిష్యత్‌లో వారికి రాజకీయ, పరిపాలనా రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరముందని అన్నారు. జిల్లా కలెక్టర్‌ హరి చందన దాసరి మాట్లాడుతూ.. వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల ఆసక్తులకు అను గుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, శాశ్వత జీవనోపాధి కల్పించడమే లక్ష్యమని వివరించారు.

అందిన ఆర్థిక చేయూత..
ఆరుగురు ట్రాన్స్‌జెండర్‌ లబ్దిదారులకు ఆర్థిక పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి రూ.75,000 చొప్పున చెక్కులను మంత్రి అందజేశారు. ఐదుగురు వికలాంగులకు రూ.1,18,500 విలువైన బ్యాటరీ ఆధారిత వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం ‘సమతా కిచెన్‌’లో ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు, వికలాంగుడికి ఉపాధి కల్పించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జితేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జిల్లా వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ అధికారి రాజేందర్‌, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అశన్న, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ప్రవీణ్‌, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఇలియా అహ్మద్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పవన్‌ కుమార్‌, ఏవో విజయలక్ష్మి, సిబ్బంది, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -