Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసర్కారు బడులను సెమీగురుకులాలుగా మార్చాలి

సర్కారు బడులను సెమీగురుకులాలుగా మార్చాలి

- Advertisement -

– డీటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ సెమీ గురుకులాలుగా మార్చాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆ సంఘం 15వ వార్షిక కౌన్సిల్‌ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పౌష్టికాహారం, సాయంత్రం స్నాక్స్‌, పాలు ఇవ్వాలని కోరారు. పాఠశాలలోనే హోంవర్క్‌ చేయించిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపే విధానం చేపట్టాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించే అవకాశముందన్నారు. గత ప్రభుత్వం కులాల వారీగా, మతాలవారీగా, ప్రస్తుత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ గురుకులాల ఏర్పాటు సరికాదని అన్నారు. ఈ చర్యల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అంతరాలను పెంచే వివిధ రకాల పాఠశాలలను కాకుండా అందరూ విద్యార్థులు కలిసి చదువుకునే ఒకే రకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్‌ చేశారు. ఐదు డీఏలను విడుదల చేయాలనీ, 2023, జులై ఒకటి నుంచి పీఆర్సీని అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని చెప్పారు. ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ సమస్యను పరిష్కరించాలని అన్నారు. కోర్టు కేసులను అధిగమించి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులు, ఇతర ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలనీ, మోడల్‌ స్కూల్‌ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, గురుకుల, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad