సీఎంకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, కాప్రా మండలంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. స్లమ్ క్లస్టర్‌లో సరిపడా ప్రభుత్వ విద్యాలయాలు లేక పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారని వారు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పాఠశాల విద్యార్థులు 7,53,084 మందిలో 505 ప్రభుత్వ పాఠశాలల్లో 84,414 మంది, 1,611 ప్రయివేటు పాఠశాలలో 6,46,716 మంది విద్యార్థులు చదువుతున్నట్టు తెలిపారు.
ఆ కార్పొరేషన్ పరిధిలో 2025 లెక్కల ప్రకారం మొత్తం 18 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 12 వేల మంది మాత్రమేననీ, వీటిలో రెండు హైస్కూల్స్‌లో కేవలం 778 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలు (సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ) లాంటి ఇంటర్నేషనల్ పాఠశాలలు 16 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు కేవలం 8 ఉండగా, వాటిలో 80-200 మందికి మాత్రమే సరిపోయే సౌకర్యాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. గబ్బిలాలపేట బస్తీలో తాత్కాలికంగా నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులుండగా, వారిలో ఆధార్ కార్డులు ఉన్న 62 మంది పేర్లనే హాజరు పట్టికలో నమోదు చేశారని తెలిపారు. దీంతో మధ్యాహ్న భోజనం కూడా 62 మందికే బిల్లులు చెల్లిస్తుంటే దాంట్లోనే 120 మందికి భోజనం సరిపెడుతున్నారని తెలిపారు. ”అద్దె భవనంలో కేవలం 3 గదులుంటే హాల్‌లో 4,5 తరగతులు, మిగతా రెండు గదుల్లో 1-3 తరగతులు నడుస్తున్నాయి. వర్షం వస్తే అంతా ఓకే రూంలో ఉంటారు లేదా సెలవులు వస్తాయి.
రెండు వాష్ రూంలు ఉన్నాయి. మిగతా బస్తీ విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవనే పేరుతో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. ముగ్గురు టీచర్లు డిప్యూటేషన్‌పై వచ్చారు. వారికి ఏప్రిల్ 23తో డిప్యూటేషన్ పూర్తవుతుం ది. వీరిలో ఒక టీచర్ ఆఫీసు పనులకే సమయం వెచ్చిస్తుండగా, మిగిలిన ఇద్దరు విద్యార్ధులకు కాపలా కాస్తున్నారు. కనీసం బ్లాక్ బోర్డులు లేవు, అందరికీ రైమ్స్ పెట్టి ఏ, బీ, సీ అని చదివించడమే. వీరికి యూనిఫామ్స్ , పాఠ్యపుస్తకాలు కూడా అందించలేదు. త్రాగునీరు కూడా లేదు. చిన్న పిల్లలకు సంరక్షణకు ఆయా లేరు. వారి గదులు వారు శుభ్రం చేసుకుంటున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత 6-10 వరకు చదవడా నికి పాఠశాల లేదు. మరో 300మందికి పైగా బాలకార్మికులుగా రోడ్లపై తిరుగుతున్నారు. పదవ తరగతి ఎలాగైనా చదివితే ఇంటర్మీడియట్ చదవడానికి కళాశాల లేదు. ఎక్కువ మంది పది తర్వాత కార్మికులుగా మారుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
”గబ్బిలాలపేట పాఠశాల లాంటి పరిస్థితిలే ఆ జిల్లాలోని 23 ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయని వారు తెలిపారు. చర్లపల్లిలో కూడా ఇలాంటి తరహా పాఠశాల తాత్కాలిక భవనంలో నడుస్తున్నది. ఈ 23 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు యూడైస్ గుర్తింపు లేదు. చర్లపల్లిలో విద్యార్థులకు పాఠశాలలు, తర్వాత కళాశాలలు లేక 10కి.మీ. దూరం ప్రమాదకర రూపంలో బస్సులలో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పన, బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయకపోవటం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గి సంక్షోభంలోకి వెళ్తున్నాయి” వారు లేఖలో తెలిపారు.
విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



