– సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సౌకర్యాల కల్పన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సౌదీ అరేబియాలో దురదృష్టవశాత్తు జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించగా, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ సౌదీకి వెళ్లారు. మదీనాలోనే ఉన్నారు. సోమవారం రాత్రి సౌదీ అరేబియాకు చేరుకున్న మంత్రి అప్పటి నుంచి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. ఆయన మైనారిటీ సంక్షేమ కార్యదర్శి బి.షఫియుల్లా, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌లతో కలిసి జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి, సౌదీలోని సీనియర్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. అంతకుముందు.. రియాద్‌లో సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్‌ను కూడా కలిశారు. పరిస్థితిని వివరించి సహకారం కోరారు. మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ సౌదీ అరేబియాలో తనకున్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి అన్ని లాంఛనాలు, అనుమతులు, లాజిస్టికల్ అవసరాలు ఆలస్యం లేకుండా వేగవంతంగా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయెబ్ కుటుంబ సభ్యుడిని కూడా కలిశారు. అతనికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి మదీనాకు చేరుకున్న మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి కలిశారు. ఆ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కూడా మదీనా చేరుకొని వారి ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతే కాకుండా మృతదేహాల గుర్తింపు, డీఎన్‌ఏ మ్యాచింగ్ ప్రక్రియను కూడా సులభతరం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా లాంఛనాలను పూర్తి చేయడానికి, స్థానిక విధానాలు, కుటుంబ ప్రాధాన్యతలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం సౌదీ అధికారులతో 24 గంటలూ కలిసి పనిచేస్తోంది. మంత్రి అజహరుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తోంది.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



