మంత్రి వాకిటి శ్రీహరి
వరంగల్‌లో హాఫ్ మారథాన్ సందడి
నవతెలంగాణ -నక్కలగుట్ట
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా క్రీడల పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హయగ్రీవాచారి స్టేడియంలో ఆదివారం నాయిని విశాల్ ట్రస్ట్, క్రెడాయి వరంగల్ సహకారంతో తెలంగాణ రన్నర్, వరంగల్ రన్నర్ అసోసియేషన్ నిర్వహించిన వరంగల్ ఫస్ట్ ఎడిషన్ హాఫ్ మారథాన్‌లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ శివసేన రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడలు జీవనశైలిలో భాగం కావాలని, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం, క్రీడలు తప్పనిసరి అని అన్నారు. వారసత్వ సంపద కలిగి ఉన్న వరంగల్ నగరంలో ఇంత పెద్ద హాఫ్ మారథాన్ నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేల కృషితో వరంగల్‌లో స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటు జరగడం నగరానికి మరో ప్రత్యేకతగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, హాఫ్ మారథాన్ వల్ల వరంగల్ నగరం ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతుందన్నారు.
ఆరోగ్యం, మత్తు పదార్థాల విముక్తి సందేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నూతన స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన చేస్తున్నారని అన్నారు. సీఎం కప్ పేరిట గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి క్రీడా ప్రతిభను గుర్తించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ హాఫ్ మారథాన్‌లో మొత్తం 2600 మంది క్రీడాకారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం 5:30 గంటలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాఫ్ మారథాన్‌కు జెండా ఊపగా, అనంతరం 5 కిలోమీటర్ల రన్‌ను మంత్రి శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్. నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, రెడ్‌క్రాస్ రాష్ట్ర ఈసీ సభ్యులు ఈవీ శ్రీనివాస్‌రావు, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



