చిన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని చూస్తూ ఊరుకోం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
బస్వాపురం (నృసింహ) ప్రాజెక్టును పరిశీలించిన బృందం
నవతెలంగాణ-భువనగిరి
బస్వాపురం (నృసింహ) ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వాలు నమ్మకద్రోహం చేశాయని, చిన్న నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపురం(నృసింహ) ప్రాజెక్టును వీరయ్యతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధతో కూడిన సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. అనంతరం విలేకర్ల సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే చిన్న నీటి ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఐ(ఎం) మొదటి నుంచి డిమాండ్ చేస్తోందన్నారు.
బస్వాపురం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.500 కోట్లను వెంటనే కేటాయించి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. వైఎస్సార్ కాలంలో శంకుస్థాపన చేసిన బస్వాపురం ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కెపాసిటీ పెంచి మరోసారి శంకుస్థాపన చేశారన్నారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా వారికి ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందన్నారు. ప్రాజెక్టు 90శాతం పూర్తయినా రైతులకు ఒక్క పంటకు కూడా నీరు అందలేదని తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టు పూర్తయితే మూసీ కాలుష్యచెర నుంచి ఆ ప్రాంత ప్రజలు బయటపడతారన్నారు. చోక్లాతండా రైతులకు, నిర్వాసితులకు నేటి వరకు ఒక్క రూపాయి అందలేదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే నిర్వాసితులతో కలిసి సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సుదీర్ఘకాలంగా అనేక దశలుగా పోరాటం చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో రూ. 30 కోట్లు మాత్రమే నిర్వాసితులకు చెల్లించిందన్నారు. కీలకమైన ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిర్వాసితులకు పూర్తిస్థాయిలో సహాయం అందించాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సహాయం అందుతుందన్నారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తేవడంలో విఫలమవుతున్నారని తెలిపారు. చోక్లా తండా నిర్వాసితుల పరిస్థితి హృదయ విధాయకరంగా ఉందన్నారు. ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదన్నారు.
మూసీ ప్రక్షాళన ఆలస్యమవుతున్నందున గోదావరి జలాలతో ఈ ప్రాంతానికి విముక్తి చేయాలని కోరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, మాయ కృష్ణ, పల్లెర్ల అంజయ్య, సిర్పంగ స్వామి, దయ్యాల నరసింహ, ముత్యాలు కొండమడుగు నాగమణి, కల్లూరి నాగమణి, మాటూరి కవిత, వడ్డేబోయిన వెంకటేష్, అన్నపట్ల కృష్ణ, కొండ అశోక్, మచ్చ భాస్కర్, నరాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
బస్వాపురం నిర్వాసితులకు ప్రభుత్వాల నమ్మకద్రోహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



