సంఘాల ఏర్పాటుకు సమాలోచనలు : మంత్రి ఉత్తమ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో సాగునీటి చెరువులు, కుంటలు, కాలువల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సాగునీటి సంఘాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. చెరువులు, కుంటలు, కాలువల భద్రత కోసం అన్ని విధాలుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతులు నష్ట పోవద్దన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంతోపాటు సాగునీటి అంశంలో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా సాగునీటి సంఘాల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తాజాగా సంభవించిన వర్షాలు ఉధతికి చిన్న నీటిపారుదల శాఖా పరిధిలోని చెరువులు, కుంటలకు గండ్లు పడడం, కాలువలు తెగి పోవడం వంటి అంశాలతో పాటు కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడం, సీతారామ, చనకా-కొరటా, సీతమ్మ సాగర్, మొండికుంట వాగు అనుమతులతో పాటు ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇందులో రాష్ట్ర నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖా సలహాదారుడు అదిత్యా నాధ్ దాస్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్‌బాబు తో పాటు సీఈ, అజరు కుమార్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, పీవీ నాగేందర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాల ఏర్పాటు ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. చిన్న సాగునీటి చెరువుల పరిరక్షణ నిమిత్తం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసిన పక్షంలో క్రమక్రమంగా భారీ నీటి తరహా ప్రాజెక్టులకు విస్తరించేందుకు దోహద పడుతుందన్నారు. సాగునీటి సంఘం, లష్కర్‌తోపాటు సిబ్బంది, నీటిపారుదల శాఖ ఆపరేషన్ నిర్వహణా విభాగం సమన్వయం చేసుకుని పనిచేసేలా సమన్వయం చేయగలిగితే సత్ఫాలితాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఈ సంఘాలకు సంబంధిత డిప్యూటీ ఇంజినీర్ కన్వీనర్‌గా వ్యవరించేలా విధి విధానాలు తయారుచేస్తామని మంత్రి తెలిపారు. 1997 నాటి నీటివనరుల అభివద్ధి సంస్థ రూపొందించిన చట్టం ప్రకారమే సాగునీటి సంఘాలకు కాలువల నిర్వహణ, నీటి పంపిణీ , చెరువుల పరిరక్షణ బాధ్యత ఉంటాయని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా సాగునీటి సంఘాలకు చట్టపరమైన, పాలనాపరమైన తోడ్పాటు ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.
2018-19లో నీటి సెస్సు రద్దు చేసిన మీదట సాగునీటి సంఘాలు కేవలము కాగితాలకే పరిమితం కావడంతో తాజాగా సంభవించిన వర్షపు ఉధతికి చిన్న నీటిపారుదల చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా సాగునీటి చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురైభారీగా దెబ్బ తినడంతో రైతులు వర్షాకాలంలో భారీగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు.రైతు కమిషన్ చైర్మెన్ యం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బందం చిన్న సాగునీటి చెరువులు నిర్లక్ష్యానికి గురవడంతో పాటు వర్షాలతో చెరువులకు గండ్లు పడి రైతాంగం నష్టపోతున్న అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్దికి నివేదిక రూపంలో అందించారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వీలుగా సాగునీటి సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఆ బందం వివరించింది. మానవ వనరులతో పాటు లష్కర్, సిబ్బంది, ఆర్థిక వనరులతో సాగునీటి సంఘాలను బలోపేతం చేయడం వంటి అంశాలతో కమిషన్ ప్రతినిధుల బందం ప్రత్యేకంగా రూపొందించిన అంశాలను మంత్రికి సిఫార్సు చేశారు.
సాగునీటి చెరువుల పరిరక్షణపై సర్కారు దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES