రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బోయిన్‌పల్లిలో రూ.3.05 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం
రాష్ట్ర క్రీడల, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ- మిడ్జిల్
ప్రజా ప్రభుత్వము విద్య, వైద్యానికి ప్రాధాన్యకిస్తూ రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, పేదలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర క్రీడల, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ చెప్పారు. ఆదివారం మండలంలోని బోయిన్‌పల్లి గ్రామంలో రూ.3.05 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురుతి రెడ్డి, పాలమూరు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త, స్థానిక సర్పంచ్ శశికళతో కలిసి రాష్ట్ర క్రీడల, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శశికళ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు.
పెద్దోడు తినేది పేదోడు తినాలని సన్న బియ్యం పథకం సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అని చెప్పారు. మిడ్జిల్ మండలం రైతుల విద్యుత్ కొరతను లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో జడ్చర్లకు 22 రెండు 33/11kv, ఒకటి 133/11kv సబ్‌స్టేషన్లు మంజూరు చేయించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ 33/11 కేవీ సబ్‌స్టేషన్ ద్వారా మిడ్జిల్ మండలంలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు. రైతులు, గృహ వినియోగదారులు మరియు చిన్న పరిశ్రమలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు నిరంతరం సీఎం మరియు మంత్రులతో నిధుల కోసం కృషి చేస్తుంటారని మంత్రి ప్రశంసించారు. పనిచేయాలనే పట్టుదల కలిగిన నాయకుడిని జడ్చర్ల ప్రజలు ఎన్నుకున్నందుకు అదృష్టవంతులని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మన జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ. మిడ్జిల్ మండల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ లోడ్ తగ్గి, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 31 సబ్‌స్టేషన్లు మాత్రమే ఏర్పాటు కాగా, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత గత రెండు సంవత్సరాలలోనే 22 (33/11 కేవీ) సబ్‌స్టేషన్లు, అలాగే నవాబ్‌పేట్‌లో 133/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేయించామని తెలిపారు. వాటిలో భాగంగా బోయిన్‌పల్లి గ్రామంలో మొదటి సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీహరి ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ రెండు సంవత్సరాల కాలంలో జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.213 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టేవారని, కానీ పనులు మాత్రం పూర్తి కాలేదని విమర్శించారు. తాను కొబ్బరికాయ కొడితే పని పూర్తయ్యే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సూపర్డెంట్ ఇంజనీరింగ్ భీమా నాయక్, డివిజన్ ఇంజనీర్ అధికారి చంద్రశేఖర్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, తహసిల్దార్ స్వప్న, ఎంపీడీవో గీతాంజలి, మిడ్జిల్ విద్యుత్ ఏఈ నరేందర్ గౌడ్, హౌసింగ్ ఏఈ మహేష్, మండల గిర్దవారి అంబికా వసంత్, వివిధ గ్రామాల సర్పంచులు, నాగరాజు గౌడు, ధర్మానాయక్, మాధవి మల్లేష్, సుజాత మల్లికార్జున రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిఖిల్ రెడ్డి, శ్యామ్ సదర్ రెడ్డి, వీరస్వామి, ప్రశాంత్ రెడ్డి, సాయిలు, వెంకటయ్య, విజయ్ కుమార్, మండల శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



