హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి
బ్యాంకు గ్యారంటీలు అందించాలి
గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి
వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్
రైస్, జిన్నింగ్ మిల్లర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తుల కొనుగోలు ఇతర అంశాలపై జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లర్లు వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు.
ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దించుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కావాల్సిన హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని, ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారంటీ, అగ్రిమెంట్లు రెండు రోజుల్లోగా అందజేయాలని సూచించారు. 2024- 25 ఖరీఫ్, యాసంగి సీజన్ సంబంధించిన సీఎంఆర్ గడువులోగా అందించాలని ఆదేశించారు. మిల్లులోని గన్ని సంచులను ఆయా కొనుగోలు కేంద్రాలకు వెంటనే తరలించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు ముందుకు వెళ్లాలని, వాటిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల ఇబ్బందులను పౌరసరఫరాల శాఖ దృష్టికి తీసుకెళ్తామని పరిష్కరించిన కృషి చేస్తామని స్పష్టం చేశారు.
జిన్నింగ్ మిల్లులో మిల్లుల్లో వసతులు కల్పించాలి
జిల్లాలోని ఐదు సీసీఐ కొనుగోలు కేంద్రాలైన జిన్ను మిల్లుల వద్ద పత్తి రైతులకు కనీస వసతులు కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధర, *కపాస్ కిసాన్* అప్లికేషన్లో స్లాట్ బుకింగ్ తదితర అంశాలు తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తూనికలు కొలతలు శాఖ వారి ఆమోదించిన కాంటాలను వినియోగించాలని, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందాలని ఆదేశించారు. జిల్లాలోని 29 వేల మంది రైతులు *కపాస్ కిసాన్* లో వివరాలు నమోదు చేసుకున్నారని సీసీఐ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రెండు ఏర్పాటు చేశామని ఆయా ప్రాంతాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డీఓ శేషాద్రి, డీసీఎస్ఓ చంద్ర ప్రకాశ్, డీఏఓ అఫ్జల్ బేగం, డీసీఓ రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, మార్కెఫేడ్ అధికారి హబీబ్, సీసీఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




