Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్టోబర్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లు

అక్టోబర్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -

మొదటిసారిగా ప్యాడీ డ్రైయర్స్‌, ప్యాడీ క్లీనర్ల వాడకం
8,332 కేంద్రాల ఏర్పాటు : పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీ.ఎస్‌.చౌహాన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీ.ఎస్‌.చౌహాన్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ప్యాడీ డ్రైయర్స్‌, ప్యాడీ క్లీనర్లను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. వీటిని ఉపయోగించడం ద్వారా పంట చేతికి వచ్చిన తర్వాత వచ్చే నష్టం, రైతులు ఎక్కువగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడటం తగ్గుతాయని వివరించారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,332 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 2025-26 సీజన్‌లో 65.96 లక్షల ఎకరాల్లో 159.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. రాష్ట్రం 75 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరిస్తుందని వివరించారు. అక్టోబర్‌ లో 6.89 లక్షల మెట్రిక్‌ టన్నులు, నవంబర్‌లో 32.95 లక్షల మెట్రిక్‌ టన్నులు, డిసెంబర్‌ లో 27.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,252, ఐకేపీల ద్వారా 3,522, ఇతరుల ఆధ్వర్యంలో 558 ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా నుంచి అత్యధికంగా 6.80 లక్షల మెట్రిక్‌ టన్నులు, జగిత్యాల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్లగొండ నుంచి 4.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపోయినంతగా తార్పాలిన్లు, ఆటోమ్యాటిక్‌ ప్యాడీ క్లీనర్లు, ఆటోమ్యాటిక్‌ ప్యాడీ డ్రైయర్స్‌, గ్రెయిన్‌ కాలిపర్స్‌, మాయిశ్చర్‌ మీటర్లు, ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ స్కేల్స్‌, హస్క్‌ రిమూవర్స్‌ తదితర వాటిని అందుబాటులో ఉంచనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌, గద్వాల, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ఉపయోగపడేలా వాతావరణశాఖ సూచనలను అందించనున్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నివారణకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ, సహకార, హౌం, గ్రామీణాభివృద్ధి, తూనికలు, కొలతలు తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్టు చౌహాన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -